‘తాడేపల్లి లక్ష్మీ కాంతారావు’ అంటే తెలియని వారుంటారేమో గానీ ‘కత్తి కాంతారావు’ అంటే తెలియని వారుండరు. ఆయన తెలుగు తెరపై తన ప్రతిభావంతమైన కత్తిసాముతో ప్రత్యర్ధికి ముచ్చేమటలు పట్టేలా అనేక జానపద చిత్రాలలో నటించిన ‘నట ప్రపూర్ణుడు’ ఆయన.
కాంతారావు (1923 నవంబర్ 16 – 2009 మార్చి 22) సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామములో జన్మించాడు. నటనపై మక్కువ కలిగిన కాంతారావు ‘నిర్దోషి’ (1951) చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేయగ ‘ప్రతిజ్ఞ’ (1953) ద్వారా కాంతారావును హీరోగా పరిచయం అయ్యారు. గ్రాఫిక్స్ మాయాజాలం లేని ఆరోజుల్లోనే జానపద బ్రహ్మగా పేరు పొందిన దర్శకుడు ‘విఠలాచార్య’ దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో నటించారు. ఆయన సినిమాలలో ఎక్కువ శాతం ‘రాజనాల’ ప్రత్యర్ధిగా నటించడం ఓ విశేషం.
ఒక వైపు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సాంఘిక, జానపద పౌరాణిక చిత్రాల్లోను రానిస్తుండగా కాంతారావు అనేక జానపద చిత్రాలలో నటించి తన వీరోచితమైన కత్తి విన్యాసాలతో ప్రేక్షకులను అలరించి తెలుగు చిత్ర సీమలో మంచి స్థాన్నాని ఏర్పరచుకున్నారు. అయితే కాంతారావు అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ఆయన పౌరాణికాలలో చేసిన ‘నారద’ పాత్రనే. నభూతో నభవిష్యత్ అన్నట్లు గా ఆ నారద పాత్రను పోషించి మెప్పించారు. ‘సీతారామకళ్యాణం’లోను, ‘శ్రీకృష్ణ తులాభారం’ ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ చిత్రాలతో పాటు అనేక పౌరాణిక చిత్రాలలో నారద పాత్రలో జీవించారు కాంతారావు.
ఎన్టీఆర్ తరువాత ఎక్కువ చిత్రాలలో శ్రీకృష్ణ పాత్ర ధరించిన ఘనత కూడా కాంతారావుకే దక్కింది. ఎన్టీఆర్ ఏదైనా పౌరాణిక చిత్రంలో తాను వేరే పాత్ర పోషిస్తూ ఉన్నట్టయితే, అందులో శ్రీకృష్ణ పాత్రకు తప్పకుండా కాంతారావునే ఎంచుకునేవారు. అలా ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలు ‘నర్తనశాల’, ‘పాండవవనవాసము’, ‘ప్రమీలార్జునీయం’ వంటి చిత్రాలలో పాటు ‘సతీ సక్కుబాయి’ చిత్రాలలో కాంతారావు శ్రీకృష్ణుడి పాత్రలు ధరించారు. అలా యన్టీఆర్ తరువాత శ్రీకృష్ణ పాత్రలో ఎక్కువసార్లు నటించిన నటునిగానూ పేరొందారు కాంతారావు. ఇక జానపదాల్లోనూ యన్టీఆర్ తరువాత ఎక్కువ చిత్రాలలో నటించిన ఘనత కాంతారావుదే. ఆయన హీరోగా రూపొందిన జానపద చిత్రాలు “జయ-విజయ, దేవకన్య, కనకదుర్గ పూజామహిమ, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, గురువును మించిన శిష్యుడు, జ్వాలద్వీప రహస్యం, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల-కోటలో రాణి, ఆకాశరామన్న, ప్రతిజ్ఞా పాలన, ఇద్దరు మొనగాళ్ళు, భలే మొనగాడు” వంటి చిత్రాలు మంచి ఆదరణ పొందాయి.
ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో కలిసి అనేక సినిమాలలో కలిసి నటించారు. ఎన్టీఆర్ కాంతారావు కలయికలో “శభాష్ రాముడు, భట్టి విక్రమార్క, దీపావళి, దేవాంతకుడు, సీతారామకళ్యాణం, సతీ సులోచన, భీష్మ, రక్తసంబంధం, లవకుశ, నర్తనశాల, బభ్రువాహన, మర్మయోగి, శ్రీసత్యనారాయణ మహాత్మ్యం, పాండవవనవాసము, ఆడబ్రతుకు, దొరికితే దొంగలు, వీరాభిమన్యు, శ్రీక్రిష్ణ పాండవీయము, శ్రీకృష్ణ తులాభారం, ప్రమీలార్జునీయం, చిక్కడు-దొరకడు, కంచుకోట, స్త్రీ జన్మ, ఏకవీర, ఒకే కుటుంబం, శ్రీకృష్ణ సత్య” వంటి చిత్రాలలో నటించారు.
ఆయన నిర్మాతగా మారి తీసిన సినిమాలు అంతగా విజయం సాధించకపోగా భారీ నష్టాల్ని మిగిల్చాయి. దీంతో తాను సినిమా రంగంలో సాధించిన సంపదనంతను కోల్పోయిన స్థాయికి చేరుకున్నారు కాంతారావు. చిత్ర పరిశ్రమలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించడం అంత తేలికైన విషయం కాదు అలానే ఆ ప్రతిష్ఠను నిలపెట్టుకోవడం కూడా తేలికైన విషయం కాదనే విషయానికి ఆయన జీవితం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
ఆయన మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపును పొందారు. కాంతారావు కుమారుడు రాజా, ‘సుడిగుండాలు’ సినిమాలో నటించారు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.
ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000 లో ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారంతో సత్కరించింది.
దాసరి నారాయణరావు మాటల్లో “తెలుగు చలనచిత్ర పరిశ్రమకుకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు”. ఆయన వర్ధంతి సందర్భంగా ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ నివాళులు అందిస్తోంది మూవీ వాల్యూం.