చిత్రం : సరిపోదా శనివారం
విడుదల తేదీ : ఆగస్టు 29, 2024
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్.జె.సూర్య, సాయికుమార్ తదితరులు
నిర్మాతలు : డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్
దర్శకుడు: వివేక్ ఆత్రేయ

Saripoda Sanivaram movie review : నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా విలక్షణమైన కథాంశంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. ఇందులో కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించే యువకుడు సూర్య కథను ఆసక్తికరంగా చిత్రీకరించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఏమేరకు కనెక్ట్ అయింది? అన్న విషయాల్ని రివ్యూలో చూద్దాం.

కథ:
సూర్య అనే యువకుడు తన కోపాన్ని ఒక రోజుకు పరిమితం చేసుకుంటాడు. తన తల్లితో చేసిన వాగ్దానం కారణంగా ప్రతి శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతను తన గ్రామంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి నిర్ణయం తీసుకుంటాడు. అదే సమయంలో చారులత అనే యువతితో ప్రేమలో పడతాడు. ఈ కథలో సూర్య తన కోపాన్ని ఎలా నియంత్రించాడు? తన గ్రామాన్ని ఎలా కాపాడాడు? చారులతతో తన ప్రేమను ఎలా నిర్వహించాడు? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ
కొత్త కథాంశాలను ప్రేక్షకులకు చేర్చాలన్న కోరిక ప్రతి దర్శకుడిలో ఉంటుంది. అయితే, ప్రతి కొత్త కథాంశం కమర్షియల్ సినిమాకు సరిపోతుందని చెప్పలేము. ఒక కొత్త కథను కమర్షియల్ ఫార్మాట్‌లో చెప్పాలంటే, దానికి తగిన శైలిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ బాగా సక్సెస్ అయ్యాడు. హీరో శనివారం తన కోపాన్ని ఎలా ప్రదర్శిస్తాడు? దానికి గల కారణమేంటి? అనే విషయాన్ని చాలా బలంగా ఎస్టా్బ్లిష్ చేశాడు వివేక్. నాని తన అద్భుతమైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. యాక్షన్ సన్నివేశాలు బాగా తెరకెక్కినాయి. మదర్ సెంటిమెంట్ చాలా బాగా ఆకట్టుకుంది. కథాంశం కొత్తగా ఉంది. కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే కొంచెం బలహీనంగా ఉంది. హీరో-హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా చూపించాల్సి ఉంది. కొన్ని సన్నివేశాలు రెగ్యులర్‌గా సాగాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్
సూర్య పాత్రలో నాని తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. కోపం, ప్రేమ, బాధ వంటి విభిన్న భావోద్వేగాలను అతను చక్కగా కళ్ళతో చెప్పగలిగాడు. చారులత పాత్రలో ప్రియాంక తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో ఆమె నటన బాగా ఆకట్టుకుంది. దయ అనే క్రూరమైన పోలీస్ అధికారి పాత్రలో ఎస్.జె. సూర్య తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇంకా .. సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ వంటి మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

మొత్తంగా చెప్పాలంటే.. ‘సరిపోదా శనివారం’ సినిమా నాని అభిమానులను నిరాశపరచదు. యాక్షన్, ఎమోషన్స్, కామెడీ అన్నింటి కలయికతో సినిమా బాగానే ఉంది. కానీ కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉండటం సినిమాకు మైనస్ పాయింట్. మొత్తం మీద సరిపోదా శనివారం ఒకసారి చూడదగ్గ సినిమా.
బోటమ్ లైన్ : యాక్షన్ అండ్ ఎమోషనల్ రైడ్
రేటింగ్ : 3.25/5

Leave a comment

error: Content is protected !!