చిత్రం : ‘సారంగదరియా’
విడుదల తేదీ : జూలై 12, 2024
నటీనటులు : నీల ప్రియా, కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంత బాబు, విజయమ్మ, హర్షవర్ధన్ తదితరులు
సంగీతం: ఎం. ఎబెనెజర్ పాల్
నిర్మాణం : సాయిజా క్రియేషన్స్
దర్శకత్వం : పద్మారావు అబ్బిశెట్టి
రాజా రవీంద్ర ప్రధానపాత్రలో నటించిన చిత్రం “సారంగ దరియా”. ఇదొక సందేశాత్మక కుటుంబ కథా చిత్రం. దీనికి పండు అలియాస్ పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మహమ్మద్, మోహిత్ పేడాడ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుందో ఈ రివ్యూలో చూద్దాం..
కథ
కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పెద్ద కొడుకు అర్జున్(మోయిన్ మొహమద్) లవ్ ఫెయిల్యూర్. దీంతో రోజూ తాగుతూనే ఉంటాడు. బార్‌లో ఎవరితోనో గొడవపడి తలలు పగలగొడుతుంటాడు. ఇంటి గురించి ఏమాత్రం పట్టించుకోడు. కూతురు అను(యశస్విని) కాలేజ్, ఇంటికే పరిమితం. బయట ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఆమెని కాలేజ్‌లో రాజ్(శివచందు) ప్రేమ పేరుతో వెంటపడుతుంటాడు. చిన్నవాడు సాయి(మోహిత్) అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటాడు. ఏదో ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేసి రొమాంటిక్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను ఫాతిమా(మధులత) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. పెద్దబ్బాయి ఏదో గొడవతో ఇంటికి వస్తుంటాడు. చిన్నబ్బాయి అమ్మాయిల విషయంలో దొరికిపోతూ కృష్ణకి మనశ్శాంతి లేకుండా చేస్తుంటారు. మరోవైపు కూతురు గురించి ఇరుగుపొరుగువాళ్లు ఆరా తీస్తుంటారు. పెళ్లి సంబంధాలు వస్తుంటాయి. ఎప్పుడు ఏదో రకమైన ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో ఇంట్లో మనశ్శాంతి లేదని, వ్రతం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో రాజ్ తండ్రి వచ్చి పెద్ద గొడవ చేస్తాడు. దీంతో కూతురుకి సంబంధించిన అసలు విషయం బయటపడుతుంది. మరి ఆ రహస్యమేంటి? మోడల్‌గా రాణించాలనుకునే అనుకి అడ్డంకి ఏంటి? అర్జున్ లవ్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఏంటి? సాయికి ఫాతిమా దక్కిందా? ఈ సమస్యల నుంచి కృష్ణ కుమార్ ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
`సారంగదరియా` సినిమా మధ్యతరగతి కుటుంబాల్లోని కష్టాలను డిఫరెంట్ యాంగిల్ లో ఎలివేట్ చేసే సినిమా. ఇందులో కేస్ట్ అండ్ రెలిజియన్ గురించి ప్రస్తావన ఉంది. ట్రాన్స్ సెక్యువల్ ప్రస్తావన ఉంది. అలాగే ఒక అమ్మాయి మోడల్‌గా ఎదగాలనుకునే ఇన్‌స్పిరేషన్ స్టోరీ ఉంది. పేరెంట్స్ ఆవేదన ఉంది. నిజానికి ఇలాంటి క్రిటికల్ సబ్జెక్ట్ ని డీల్ చేయడం కత్తిమీద సాములాంటిదే. కానీ దర్శకుడ తొలి సినిమాతోనే సరళంగా చెప్పే ప్రయత్నం చేయడం మెచ్చుకోదగ్గదే. ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేస్తూ, అంతర్లీనంగా మంచి సందేశాన్ని ఇవ్వడం ఈ సినిమాలో హైలైట్ పాయింట్. ఇప్పుడు ఆడియెన్స్ సందేశాత్మక చిత్రాలను చూసేందుకు ఆసక్తిగా లేరు. ఏదైనా వినోదాత్మకంగా, కమర్షియల్‌గా చెబితేనే , చూస్తున్నారు. అందుకే కమర్షియల్ వేలో సినిమాని చూపించే ప్రయత్నం చేశారు `సారంగదరియా` టీమ్. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.
టీనేజ్ కుర్రాళ్లకి బాగా కనెక్ట్ అయ్యేలా ఇప్పుడు జనరేషన్‌కి దగ్గరగా ఉంటుంది ఈ సినిమా. ఓవరాల్‌గా ఫస్టాఫ్ ఓకే అనిపించేలా ఉంటుంది. ఇక రెండో భాగాన్నీ డీల్ చేయడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ప్రతి సీన్‌ని ఎక్కువగా, డిటెయిల్‌గా చెప్పే ప్రయత్నంలో అది బోరింగ్‌గా మారింది. ఎమోషన్స్ పలుచబడ్డాయి. వరుసగా కష్టాలు ఎదురుకావడంతో కృష్ణ పాత్రలోని నిస్సాహయత ఆడియెన్స్ లో కలుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా ఊపందుకుంటుంది. అమ్మాయి పాత్రలోని ట్విస్ట్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అను పాత్ర యాక్టివ్‌గా మారడంతో సినిమా ఊపందుకుంటుంది. లింగమార్పిడికి సంబంధించిన అంశాలు, మోడల్ కావాలనుకునే తన ఆశయాలకు సంబంధించి అను పడే స్ట్రగుల్స్ గుండెని బరువెక్కించేలా ఉంటాయి.
నటుడిగా రాజా రవీంద్రకు మంచి మైలేజ్ ఇచ్చే చిత్రం సారంగదరియా. ఇందులో ఆయన నటన, ఎమోషన్స్ పలికించే తీరుకు మంచి మార్కులు పడతాయి. మొత్తంగా చెప్పాలంటే.. సారంగదరియా చిత్రం హృద్యమైన ఒక ఫ్యామిలీ ఎమోషనల్ మూవీగా చెప్పుకోవాలి. ఫీల్ గుడ్ చిత్రాలను కోరుకొనే వారికి ఈ సినిమా బెటర్ ఆఫ్షన్.
ట్యాగ్ లైన్ : ఫ్యామిలీ ఎమోషనల్ జెర్నీ..