ఆయన నవ్వితే.. ఆ వింత శబ్దానికి మనకు నవ్వొస్తుంది. ఆయన నడిచినా .. నాట్యం చేసినా.. డైలాగ్ చెప్పినా… ఏదో తెలియని తమాషా . తెలుగు సినీ హాస్యనటుల్లో ఆయన చాలా ప్రత్యేకం. ఆయన పేరు సారథి. పూర్తి పేరు కడలి విజయసారథి. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ ఆయన స్వగ్రామం. చిన్నప్పటినుంచీ ఆయనకు నాటకాలంటే.. ఎనలేని మక్కువ. 1945లో మొదటిసారి గా శకుంతల నాటకంలో భరతుడిగా నటించారు. ఆ తరువాత సుమారు 50 సంవత్సరాలు నాటకరంగానికి సేవచేశారు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించారు సారథి.
సారథి 1960లో ‘సీతారామ కళ్యాణం చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో నలకూబరునిగా నటించారు. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ముఖ్యంగా విఠలాచార్య తన జానపద చిత్రాల్లో సారథికి రకరకాల పాత్రల్ని సృష్టించేవారు. ఏ సినిమాలో నటించినా.. తన విచిత్రమైన నవ్వుతో తనకో ఐడెంటిటీ ఏర్పరుచుకున్నారు సారథి.. ఆయన దాదాపు 372 తెలుగు సినిమాలలో నటించారు. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడు గానూ, ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగానూ పనిచేశారు. ప్రస్తుతం భీమవరంలో తన శేషజీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు సారథి. నేడు సారథి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ సీనియర్ హాస్యనటుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.