నటభూషణ శోభన్ బాబు రొమాంటిక్ హీరోగానే అందరికీ తెలుసు. అయితే..ఆయనలో సెంటిమెంట్ ను, ఎమోషన్స్ ను అద్భుతంగా పలికించే కోణం కూడా ఉందని చాలా చిత్రాలు నిరూపించాయి. అలాంటి ఓ అరుదైన చిత్రం ‘సన్నాయి అప్పన్న’. శ్రీరమణా చిత్ర బ్యానర్ పై హీరో చలం సమర్ఫణలో రవి, హరి నిర్మించిన ఈ సినిమా 1980లో విడుదలై… ఘన విజయం సాధించింది. 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి లక్ష్మీ దీపక్ దర్శకుడు. సన్నాయిని అద్భుతంగా పలికించే అప్పన్న జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథాంశం. జయప్రద కథానాయికగా నటించిన ఈ సినిమాలో .. ఈశ్వరరావు, సంగీత, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, మాడా వెంకటేశ్వరావు , సాక్షి రంగారావు, పొట్టి ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమా కన్నడలో రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘సనాది అప్పణ్ణ’ చిత్రానికి రీమేక్ వెర్షన్ . జీ.కె.వెంకటేశ్ సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్నిఎంతగానో అలరించాయి. ముఖ్యంగా సన్నాయి రాగానికి, ఈ చిన్నారి నాట్యానికి పాట అత్యంత ప్రజాదరణ పొందింది.