విలక్షణమైన నటన.. విశిష్టమైన వ్యక్తిత్వం.. వైవిధ్యమైన పాత్ర పోషణ.. విభిన్నతరహా చిత్రాలు.. ఆయన్ను బాలీవుడ్ కే అద్భుతమైన నటుడ్ని చేశాయి. సహజత్వానికి పెద్ద పీట వేయడంతో .. ఆయన పోషించిన పాత్రలన్నీ ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ ఆయనది ప్రత్యేకమైన స్థానం. ఆయన పేరు సంజీవ్ కుమార్. షోలే చిత్రం ఆ పేరును ఠాకూర్ బలదేవ్ సింగ్ గా మార్చేసింది.
1965లో ‘నిషానా’ సినిమాతో హీరో అవతారమెత్తిన సంజీవ్ కుమార్ అచిరకాలంలోనే ‘ఖిలోనా’ వంటి విభిన్న సినిమాల్లో అద్భుత నటనా వైదుష్యాన్ని చూపి, భవిష్యత్ ప్రస్థానానికి పునాదులు నిర్మించుకున్నాడు. రాజిందర్ సింగ్ బేడి నిర్మించిన ‘దస్తక్’ సినిమా ఉత్తమ కథానాయకునిగా సంజీవ్ కుమార్‌కు జాతీయపురస్కారాన్ని అందించింది. తరువాత గుల్జార్ దర్శకత్వం వహించిన ‘కోషిష్’, ‘పరిచయ్’ సినిమాలు విభిన్న పాత్రలను ప్రసాదించి సంజీవ్ కుమార్‌లోని అసలు సిసలైన నటుణ్ణి వెలికి తీశాయి. తెలుగులో తొలిసారిగా శారద కథానాయికగా నటించిన ‘ఊర్వశి’ అనే చిత్రంలో హీరోగా నటించి మెప్పించారు. సంజీవ్ కుమార్ రెండుసార్లు ‘దస్తక్’, ‘కోషిష్’ సినిమాలలో నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలో ‘భరత్’ అవార్డు అందుకున్నారు. మూడు సార్లు ఫిలింఫేర్ సంస్థ నుంచి ఉత్తమ నటుడి బహుమతులు అందుకున్నారు. తొమ్మిదిసార్లు సంజీవ్ కుమార్ పేరును ఉత్తమ నటుడి బహుమతి కోసం ప్రతిపాదించారు. వరుసగా ఖిలోనా, కోషిష్, షోలే, మౌసమ్, ఏ హై జిందగీ, జిందగి, దేవత, పతి పత్ని అవుర్ వో, అంగూర్. త్రిశూల్, విధాత చిత్రాలలో నటనకు ఉత్తమ సహాయ నటుడి గా సంజీవ్ కుమార్ పేరు ఫిలింఫేర్ బహుమతికోసం నామినేట్ అయ్యాయి. సంజీవ్ కుమార్‌ను వరించిన ఇతర సంస్థల అవార్డులు పన్నెండు దాకా వున్నాయి. గుజరాత్ ప్రభుత్వం సూరత్ పట్టణంలో ఒక వీధికి ‘సంజీవ్ కుమార్ మార్గ్’ అనే పేరు పెట్టింది. సూరత్ లోని ఒక పాఠశాలకు సంజీవ్ కుమార్ పేరు పెట్టారు. 3 మే, 2013న సంజీవ్ కుమార్ చిత్తరువుతో తపాలా శాఖ స్మారక స్టాంపును విడుదల చేసింది. సూరత్ పట్టణంలోనే సంజీవ్ కుమార్ పేరుతో ఒక పెద్ద ఆడిటోరియం నిర్మించారు. నేడు సంజీవ్ కుమార్ జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.