ఆయన సాహిత్య సంపద అపారం. సముద్రమంతటి లోతైన దృష్టికోణంతో ఒక పాటనైనా మాటనైనా తన కలం నుంచి జాలువార్చడం ఆయనకు మాత్రమే చెల్లింది. నలభైల నుంచి అరవైల వరకూ తెలుగు తెరమీద ఆయన విరబూయించిన రచనా సుమాల్ని అప్పటి ప్రేక్షకులు ఎంతో మక్కువతో ఆఘ్రాణించేవారు.ఆయన పేరు సముద్రాల రాఘవాచార్యులు. పౌరాణిక చిత్ర గీతాలకు, భక్తిగీతాలకు అద్భుతమైన పదబంధాలతో పాటలు, వ్యావహారిక భాషలో మాటలు రాసి నూతన వరవడికి శ్రీకారం చుట్టిన మహనీయుడు సముద్రాల రాఘవాచార్యులు. మూడు దశాబ్దాల సుదీర్ఘ సాహితీ సమరంలో ఒకేరోజు ఉదయం, మాద్యాహ్నం, సాయంత్రం మూడు వేరువేరు చిత్రాలకు నిర్విరామ సాహిత్య రచన చేసిన సవ్యసాచి సముద్రాల.
సరస్వతీ టాకీస్‌కు చెందిన పారుపల్లి శేషయ్య, కురుకూరు సుబ్బారావు కొల్హాపూర్‌లో ‘ద్రౌపదీ వస్తాప్రహరణం’ చిత్రాన్ని నిర్మిస్తూ సముద్రాల చేత కొన్ని సన్నివేశాలకు సంభాషణలు రాయించుకున్నారు. తరువాత సరస్వతీ టాకీస్ వారి ఆఫీసు మద్రాసుకు మారింది. రెండవ ప్రయత్నంగా చందాల కేశవదాసు నాటకం ‘కనకతార’ ను హెచ్.వి.బాబు దర్శకత్వంలో సినిమాగా నిర్మిస్తూ గూడవల్లి రామబ్రహ్మం సూచన మేరకు మాటలు, పాటలు, పద్యాలు పూర్తిగా సముద్రాల చేత రాయించారు. నాటకంలో వున్న గ్రాంధిక భాషను పక్కన పెట్టి వ్యావహార భాషా శైలిలో సంభాషణలు రాసి ‘భేష్’ అనిపించుకున్నారు. అలాగే కేశవదాసు రచించిన పద్యాలను మార్చి వ్యావహారిక భాషలో పద్యాలు రాశారు. కీర్తనలవంటి పాటల స్థానంలో జానపద శైలిలో పాటలు రాశారు. ఆరోజుల్లో ఇది ఒక విప్లవాత్మక పరిణామం. ఆ తర్వాత ‘శ్రీకృష్ణ పాండవీయం, రత్నమాల, భక్త పోతన,దేవత, బాలరాజు, పల్నాటి యుద్ధం, లైలా మజ్ను, యెగివేమన, షావుకారు, దేవదాసు, విప్రనారాయణ, అనార్కలి, దొంగరాముడు, సువర్ణసుందరి, భూకైలాస్, సీతారామకళ్యాణం, బాటసారి, లవకుశ, నర్తనశాల, పాండవ వనవాసం, భక్త ప్రహ్లాద’ లాంటి చిత్రాలకు ఆయన పాటలు, మాటలు ప్రాణం పోశాయి. నేడు సముద్రాల జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.