ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. మన దేశంలో రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. దానికి ఒకటే మార్గం. వీలైనంత వరకూ ఇంట్లోనే గడపడం. లాక్ డౌన్ ను వంద శాతం పాటించడం. అలా ఇంటికే పరిమితమైన వాళ్ళలో రోజు కూలీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన రోజు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ లో చిరంజీవి ఆధ్వర్యంలో విరాళాల సేకరణ జరుగుతోంది. అలాగే బాలీవుడ్ లో కూడా పలువురు స్టార్ హీరోలు భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు. ఇప్పటికే అక్కడ అక్షయ్ కుమార్ ఏకంగా రూ. 25 కోట్లు విరాళం ఇచ్చి సంచలనం రేపాడు. మరోవైపు అజయ్ దేవ్‌గణ్, వరుణ్ ధావన్,అమితాబ్, హృతిక్,విక్కీ కౌశల్ వంటి నటులు తమ వంతుగా సాయం చేసారు. సల్మాన్ ఖాన్ కూడా తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అన్నమాట ప్రకారం తొలి విడగా.. 25 వేల కార్మికుల ఖాతాల్లో రూ.3 వేలు జమ చేసి మానవత్వం చాటుకున్నారు . ఈ విషయాన్ని ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్ యూనియన్ తెలిపింది.
ఒకేసారి పూర్తి సాయం చేస్తే.. అనవసరంగా ఖర్చు చేస్తారని.. అందుకే పలు విడతల్లో ఇవ్వాలనే నిర్ణయానికి సల్మాన్ ఖాన్ వచ్చారు. ఆ తర్వాత రెండు మూడు విడతల్లో మిగతా డబ్బులను వేస్తానని ప్రకటించారు. పరిస్థితులు చక్కబడే వరకు సినీ కార్మికులకు సహాయం చేస్తానని ప్రకటించారు. సల్మాన్ ఖాన్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ 3000 మంది సినీ కార్మికులకు రూ. 5 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందజేసింది. వీళ్లతో పాటు రోహిత్ శెట్టి, బోనీ కపూర్,అర్జున్ కపూర్ ఫిల్మ్ ఫెడరేషన్‌కు విరాళాలు అందజేసారు. ఇక ప్రొడ్యూసర్ గిల్ట్ ఆప్ ఇండియా రూ. 1.5 కోట్లు సాయం చేసింది. మొత్తంగా చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన డబ్బులతో సినీ కార్మికులను ఆదుకుంటామని ఫెడరేషన్ అధ్యక్షుడు తివారీ చెప్పారు.