ఆయన చక్కటి చమత్కారాలతో నవ్వించనూ గలడు. చిక్కటి విషాదాన్ని రగిలించి ఏడ్పించనూ గలడు. గంభీరమైన పాత్రలతో తనలోని నటుడిని వెలికితీసి.. ఉత్తమనటనను ప్రదర్శించనూ గలడు. నాటకాల నుంచి వెండితెరకొచ్చి.. విలక్షణమైన అభినయాన్ని పండించే ఆయన పేరు సాక్షిరంగారావు. బాపురమణల తొలిచిత్ర సాక్షిగా నటుడిగా మారిన రంగారావు .. ఆ సినిమా ఘనవిజయంతో .. సాక్షిరంగారావు అయ్యారు.
సాక్షిరంగారావు పూర్తి పేరు రంగవఝుల రంగారావు. గుడివాడ వద్ద నున్న కొండిపర్రు గ్రామం ఆయన స్వస్థలం. నటించిన మొదటి సినిమా 1967లో విడుదలైన బాపూ-రమణల సాక్షి. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావుకి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు సాక్షి శివ టీవీ సీరియల్స్ నటుడు. రంగారావు సుమారు 450 చిత్రాల్లో నటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టెనోగ్రాఫర్ గా పనిచేసేటప్పుడే ఆయన కిష్టమైన నాటకరంగంలో విరివిగా పాల్గొనేవారు. మొదట్లో ఆర్తితో నిండిన పాత్రల్లో నటించినా, ‘సిరివెన్నెల, స్వర్ణకమలం, ఏప్రిల్ 1 విడుదల, జోకర్’ మొదలైన సినిమాల్లో చేసిన పాత్రలు ఆయన్ను హాస్యనటున్ని చేశాయి. ఆయన నటించిన చివరి సినిమా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘స్వరాభిషేకం’. నేడు సాక్షిరంగారావు వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.