సాయిపల్లవి ఈ పేరు వినగానే వెండితెరపై తన అందం అభినయంతో పాటు ఉర్రూతలూగించే డ్యాన్స్లకు కూడా పెట్టింది పేరు. ‘ఫిదా’ చిత్రంలోని ‘‘వచ్చిండే పిల్లా’’ పాటతో ఆమెలోని అద్భుతమైన డ్యాన్సర్‌ను సినీప్రియులకు పరిచయం చేశారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఇప్పుడు తన దర్శకత్వంలోనే రూపొందుతోన్న చిత్రం ‘లవ్‌స్టోరీ’ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 16న విడుదలవుతోంది. ఈ సినిమాలోను ‘‘వచ్చిండే పిల్లా’’ తరహాలో ఓ అదిరిపోయే పాటను సెట్‌ చేశారు దర్శకుడు. అదే ‘‘సారంగ దరియా’’. ఈ గీతాన్ని ఆదివారం నటి సమంత ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. మంచి జోష్తో హుషారెత్తించే బీట్‌తో సాగుతున్న ఓ చక్కటి తెలంగాణ జానపద సాహిత్యం గల పాట ఇది. పవన్‌ సి.హెచ్‌ బాణీలను సమకూర్చారు. ‘‘వచ్చిండే..’’ పాటకి సాహిత్యం అందించిన సుద్దాల అశోక్‌ తేజనే ఈ గీతాన్నీ రచించడం ఓ విశేషమైతే “ఫిదా” లోని ‘‘వచ్చిండే..’’ పాటను పాడిన గాయని మంగ్లీనే ఈ పాటను పాడడం మరో విశేషం. శేఖర్‌ మాస్టర్‌ కోరియోగ్రఫితో సాయిపల్లవి డ్యాన్స్‌ మూమెంట్స్ జతకలిసిన ఈ పాట అందరిని ఆకట్టుకుంటూ విడుదలైన 24 గంటలలోనే యూట్యూబ్ లో నెంబర్ 1 గా ట్రెండ్ అవుతూ ౩౦౦కె లైక్స్ పైగా 6 మిలియన్ వివ్యూస్ తో దూసుకుపోతూ మునుపటి పాటల రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది.

పాటలోని భావం మరియు పదాల అర్ధాలు :
“దరియా” అంటే ఉర్దూ/హిందీ భాష లో నది, ఏరు, సముద్రం అనే అర్థాలు వస్తాయి. ఇక “సారంగా” అంటే సంగీతం లోని ఒక రాగానికి గల పేరు లేదా సంగీత వాయిద్యం.
ఈ పాట సందర్భాన్ని పరిశీలిస్తే, ఒకచోట కుదురుగా ఉండని కథానాయిక స్వభావాన్ని “పారే నది” గా పోలుస్తూ “సారంగ దరియా” అనే పదాన్ని రచయిత ఉపయోగించారని అనుకోవచ్చు.
కడవ అంటే కుండ అనే అర్థం వస్తుంది.
తన కుడి, ఎడం భుజాలపై కుండని తీసుకెళ్తూ, మెరిసే వస్త్రాలను ధరించి, ఎవ్వరికి అంత సులువుగా చిక్కని కథానాయిక వ్యక్తిత్వం అనేది కదిలే నదిలా పారుతూ సాగుతుందని వర్ణించారు రచయిత.

కాళ్లకు ఎండి గజ్జల్
లేకున్నా నడిస్తే ఘల్ ఘల్
కొప్పుల మల్లే దండల్
లేకున్నా చెక్కిలి గిల్ గిల్
సాధారణంగా కొంతమంది అందం అనేది ఆభరణాలతోనో, అలంకరణలతోనో వస్తుందని భావిస్తారు. కాని ఎటువంటి ఆభరణాలు, అలంకరణలు అవసరం లేకుండానే కథానాయిక యొక్క వ్యక్తిత్వం వలన వచ్చిన అందాన్ని పాటలో ఎంతో అద్భుతంగా వర్ణించారు రచయిత. గజ్జెలు అవసరం లేకుండానే గజ్జెలతో సమానంగా తన వేసే అడుగులకు ఆ సవ్వడి ఉందని, మల్లెపూలు పెట్టుకోకుండానే ఆ మల్లెపూల వెలుగులతో సమానంగా తన చెక్కిలి వెలుగులు ఉన్నాయని రచించారు.
నవ్వుల లేవుర ముత్యాల్
అది నవ్వితే వస్తాయి మురిపాల్

సాధారణంగా కవులు “నవ్వితే ముత్యాలు రాలును” అంటు వర్ణిస్తారు కాని సుద్దాల ఈ పాటలో తను నవ్వినప్పుడు ముత్యాలకు బదులు మురిపాలు వస్తాయి అని చేసిన పద ప్రయోగం బావుంది.

నోట్లో సున్నం కాసుల్
లేకున్నా తమ్మలపాకుల్
నోట్లో సున్నం కాసుల్
లేకున్నా తమ్మలపాకుల్
మునిపంటితో.. మునిపంటితో.. మునిపంటితో.. నొక్కితే పెదవుల్
ఎర్రగా అయితది రా మన దిల్ నొక్కితే పెదవుల్
ఎర్రగా అయితది రా మన దిల్

మనం కిళ్ళి తిన్నప్పుడు మన నోరు, నాలుక ఎర్రగ పండుతాయి. ఇవేమీ అవసరం లేకుండానే, తన పెదవిని మునుపంటితో అదిమినప్పుడు కథానాయిక పెదవి ఎరుపు ఎక్కడంతో పాటు ఆ పెదవులని చుసిన హృదయాలు కూడాఎరుప్పెక్కుతాయి అని ఎంత అద్భుతంగా వర్ణించారు.
చురియా చురియా చురియా
అది సుర్మా పెట్టిన చురియా

“చురియా” అంటే ఉర్దూ/హింది భాషలో పక్షి గిజిగాడు అని అర్ధం అంటారు. “సుర్మా” అంటే ముస్లింలు వాడే ఒకరకమైన కాటుక. ఆ కాటుక పెట్టుకున్నకనుల వంటి గిజిగాడు పక్షి తో కథానాయిక అందాన్ని పోల్చారు రచయిత.

రంగే లేని నా అంగి
జడ తాకితే అయితది నల్లంగి
అంగి అంటే ధరించే వస్త్రం/చొక్కా. రంగే లేని అంగి అంటే, తెల్లటి వస్త్రంగా అర్థం వస్తుంది. కథానాయిక తెల్లటి వస్త్రం ధరిస్తే తన జడకి ఉండే నలుపు, ఆ తెల్లటి వస్త్రానికి అంటుకుని, తెల్లని అంగి, నల్లని అంగిగా రంగు మారుతుందని తన కురుల నలుపు వర్ణ సౌందర్త్యం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు.
మాటల ఘాటు లవంగి
మర్ల పడితే అది శివంగి
శివంగి అంటే ఆడపులి అని అర్థం. “మర్ల పడితే” అంటే “తిరగబడితే” అనే అర్థం వస్తుంది. తన మాటలు లవంగంలా అంత ఘాటుగా ఉంటాయని, ఏదైనా తేడా వస్తే తను శివంగిలా తిరగబడుతుంది అని కథానాయిక శక్తిని వివరిచారు.
తీగలు లేని సారంగి
వాయించబోతే అది ఫిరంగి

ఫిరంగి అంటే యుద్ధంలో పేలుడు పదార్థాలని ఉంచి శత్రువులపై ప్రయోగించడానికి ఉపయోగించే ఒక ఆయుధం. సారంగి అంటే మునుపు చెప్పినట్లు ఒక సంగీత వాయిద్యం. చూడడానికి, వినడానికి కథానాయిక సంగీత వాయిద్యం లాగ మధురంగా ఉంటుంది కానీ, అలుసుగా తీసుకుంటే ఫిరంగి లాగా మండగలదు అని కథానాయిక ధైర్యాన్ని వివరించే ప్రయత్నం చేశారు.
గుడియా గుడియా గుడియా
అది చిక్కి చిక్కని చిడియా

హింది/ఉర్దూ భాషలో “గుడియా” అంటే బొమ్మ అని అర్థం. చిడియా అంటే పక్షి అని అర్థం. చూడడానికి బొమ్మ లాగా ఆకర్షవంతం గా ఉండే కథానాయిక, తన అర్థం అయ్యి, అవ్వని, వ్యక్తిత్వంతో చిక్కి చిక్కని పక్షి లాంటిది అని వర్ణించారు.
దాని సెంపల్ ఎన్నెలు కురియా
దాని సెవులకు దుద్దుల్ మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని నడుం ముడతలే మెరియా
పడిపోతది మొగోళ్ళ దునియా
తన చెంపలు వెన్నెల లాగా మెరుస్తాయని. చెవికి పెట్టుకునే దుద్దులు మెరుస్తూ ఉంటాయని, తన నడుముకున్నముడుడతల మడత అందాలని చూస్తే మగవాళ్ళు తమ ప్రపంచాన్ని మైమరచి పోతారని వివరించారు.

 

 

లిరిక్స్ :

దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యేజెంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

కాళ్లకు ఎండి గజ్జల్
లేకున్నా నడిస్తే ఘల్ ఘల్
కొప్పుల మల్లే దండల్
లేకున్నా చెక్కిలి గిల్ గిల్
నవ్వుల లేవుర ముత్యాల్
అది నవ్వితే వస్తాయి మురిపాల్
నోట్లో సున్నం కాసుల్
లేకున్నా తమ్మలపాకుల్
మునిపంటితో.. మునిపంటితో.. మునిపంటితో.. నొక్కితే పెదవుల్
ఎర్రగా అయితది రా మన దిల్

చురియా చురియా చురియా
అది సుర్మా పెట్టిన చురియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యేజెంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

రంగే లేని నా అంగి
జడ తాకితే అయితది నల్లంగి
మాటల ఘాటు లవంగి
మర్ల పడితే అది శివంగి
తీగలు లేని సారంగి
వాయించబోతే అది పిరంగి
గుడియా గుడియా గుడియా
అది చిక్కి చిక్కని చిడియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని సెంపల్ ఎన్నెలు కురియా
దాని సెవులకు దుద్దుల్ మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని నడుం ముడతలే మెరియా
పడిపోతది మొగోళ్ళ దునియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యేజెంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

Leave a comment

error: Content is protected !!