Saidharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన 18వ సినిమాతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతోంది ఈ చిత్రం. రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. కె.నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
పీరియాడికల్ యాక్షన్ డ్రామా జానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఒక ప్రత్యేకమైన పోస్టర్‌తో చిత్రం ప్రారంభమైనట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. “భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న సాయి ధరమ్ తేజ్ ఇందులో ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు.
ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైంది. తెలుగుతో పాటు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం” అని నిర్మాతలు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ తన కెరీర్‌లోనే ఇప్పటివరకు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం తో ఆయన మరోసారి ప్రేక్షకులను మెప్పించగలడేమో చూడాలి.