ఆయన కన్నుపడిన దృశ్యం.. వెండితెరపై వీనుల విందు చేస్తుంది. ఆయన కంటపడిన ప్రదేశాన్ని తన కెమేరా కన్నుతో చూస్తే అది రంగుల ప్రపంచాన్ని తలపిస్తుంది. రీల్ రీల్ లోనూ , ఫ్రేమ్ ఫ్రేమ్ లోనూ కళాత్మకత ను అలంకరించడం ఆయన స్టైల్. ప్రకృతి సౌందర్యాన్ని , ఆ రమణీయతను మనకళ్ళ ముందు సాక్షాత్కరింపచేసే ఆ ఛాయామాంత్రికుడు యస్.గోపాలరెడ్డి. ఎన్నో తెలుగు, హిందీ చిత్రాలకు తన అద్భుతమైన కెమేరా పనితనాన్ని రుచిచూపించిన సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ ఆయన. గోపాల్ రెడ్డి కృష్ణా జిల్లాలో జన్మించారు. ఆయన మరో కెమెరామెన్ అయిన రసూల్ ఎల్లోర్ సోదరి మైకేలాను వివాహం చేసుకున్నారు.  కుమారుడు సందీప్, కుమార్తె సంధ్య ఆయన సంతానం. సందీప్ కూడా కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు.

1968 లో చెన్నైలోని వీనస్ స్టూడియోలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి. ఎస్. ఆర్. స్వామి దగ్గర సహాయకుడిగా గోపాలరెడ్డి  కెరీర్ ప్రారంభమైంది. సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో అనేక బ్లాక్ అండ్ వైట్  చిత్రాలకు పనిచేశారాయన. 1979 లో ఆయనకు సినిమాటోగ్రాఫర్ గా పేరు వచ్చింది. తరువాత 1980 వ దశకంలో అనేక తెలుగు, బాలీవుడ్ సినిమాలకు పనిచేశాడు. 1980 వ దశకంలో అమితాబ్ బచ్చన్ నటించిన ఆఖరీ రాస్తా, ఇంక్విలాబ్, సూర్యవంశీ మొదలైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆ తరువాత 1990 వ దశకంలో అజయ్ దేవగణ్, సైఫ్ ఆలీ ఖాన్ నటించిన కచ్చే ధాగే సినిమా కూడా ఆయనకు పేరు తెచ్చిన చిత్రం. ఆయన మొత్తం 150 సినిమాలకు పైగా పనిచేస్తే అందులో నాగార్జున కథానాయకుడిగా నటించినవి 15 సినిమాలున్నాయి. ‘క్షణక్షణం, దొంగాట, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ఆయన నిర్మాతగా పేరు తెచ్చిన సినిమాలు. రవితేజ హీరోగా వచ్చిన తమిళ  రీమేక్ ‘నా ఆటోగ్రాఫ్’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు గోపాలరెడ్డి. నేడు యస్.గోపాలరెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!