దేశమంతటా ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్న తరుణం.. ట్రిపుల్ ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుస్తుందా ? ఆస్కార్ వేదికపై భారత్‌ను రిప్రజెంట్ చేస్తూ ఓ తెలుగు సినిమా ఆస్కార్ అవార్డ్ గెలుస్తుందా అనే ఉత్కంఠతో యావత్ భారతం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సినీ లవర్స్ ఉన్నారు. ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. తెలుగు సినిమా ఖ్యాతిని, దేశం ప్రతిష్ఠను ఓ నాటు సాంగ్ నిలబెట్టింది. 95 వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ట్రిపుల్ ఆర్ టీమ్ చేసిన సందడి.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ తో నాటు నాటు సాంగ్ చేసిన మేజిక్ కేవలం కమర్షియల్ గానే కాకుండా.. యూట్యూబ్ , టిక్ టాక్, రీల్స్ , షార్ట్స్ వీడియో రికార్డ్స్‌కే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టించే ఆస్కారం ఉందని నమ్మిన రాజమౌళి , ఎంఎం కీరవాణి ల నమ్మకాన్ని నిలబెట్టింది.
ఆస్కార్ వేడుక ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశం మొత్తం ట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్ నామినేట్ కావడమే గొప్ప అనుకున్నారు. ఆ తరువాత అమెరికాలో ఎన్టీఆర్ , తారక్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లు చేసిన సందడితో ఆస్కార్ అవార్డ్ వస్తుందనే నమ్మకం కలిగింది. కానీ అసలు మూమెంట్ వచ్చేసరికి ఊపిరి సలపని ఉత్కంఠ.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి నుంచి నామినేషన్ పొందిన నాటు నాటు సాంగ్ కు ఇంట్రడక్షన్ ఇచ్చింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లు స్టేజ్ పై లైవ్ పర్‌ఫార్మెన్స్ ఇస్తుంటే.. ఫారిన్ డాన్సర్స్ దుమ్ము రేపారు.
రిహానా పాడిన లిఫ్ట్‌మి అప్, అప్లాజ్ – టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్, దిస్ ఈజ్ ఏ లైఫ్ – ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, హోల్డ్ మై హ్యాండ్స్ – టాప్‌గన్ మావెరిక్ వంటి సాంగ్స్ తో పోటీ పడింది. అయితే నాటునాటు సాంగ్ చేసిన మేజిక్ కు ప్రపంచమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డ్స్ వేదిక కూడా ఊగిపోయింది. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో ట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్ 95 వ అకాడమీ అవార్డ్ ను గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ సినిమా ట్రిపుల్ ఆర్ గా నిలిచింది. భారతదేశంలోని గ్రామీణ సంస్కృతి గొప్పదనాన్ని ఆస్కార్ వేదికగా చాటింది నాటునాటు సాంగ్.
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గీతరచయత చంద్రబోస్ లు ఆస్కార్ అవార్డ్‌ను అందుకున్నారు. ఎంఎం కీరవాణి తనదైన స్టైల్‌లో పాడుతూ రాజమౌళి కుమారుడు కార్తికేయకు, తన ఫ్యామిలీకి, ట్రిపుల్ ఆర్ టీమ్‌కి థ్యాంక్స్ చెప్పాడు. చంద్రబోస్ జస్ట్ నమస్కారంతో తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. దేశమంతటా తలెత్తుకునేలా ఓ తెలుగోడి నాటు సాంగ్ చేసింది. నిజంగా ఇది తెలుగు సినీ చరిత్రలో మరపురాని ఘట్టం.