వేసవి సినిమాలకు అత్యంత ముఖ్యమైన సీజన్ అయినప్పటికీ, ఈ ఏడాది వేసవి చాలా డల్ గా ఉంది. పెద్ద సినిమాల కొరత, ఎన్నికలు, ఐపీఎల్ వంటి కారణాల వల్ల థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, గతంలో బాక్సాఫీస్‌ను శాసించిన సినిమాలను మళ్లీ విడుదల చేసే ధోరణి జోరుగా కొనసాగుతోంది. ఈ ధోరణిలో భాగంగా, మరోసారి థియేటర్లలోకి రాబోతోంది క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’.
దశాబ్దాల తర్వాత తెలుగులో వచ్చిన అసలైన మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌లను గ్లోబల్ స్టార్స్‌గా మార్చిన ఈ చిత్రం దర్శకధీరుడు రాజమౌళి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ₹1387 కోట్లకు పైగా వసూలు చేసిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి రాబోతోంది.
ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని హిందీలో విడుదల చేసిన పెన్ మూవీస్, ఈ మేగ్నమ్ ఓపస్‌ను మరోసారి థియేటర్లలోకి తీసుకురాబోతోంది. మే 10న తెలుగుతో పాటు హిందీలోనూ 2D, 3D ఫార్మాట్‌లలో ‘ఆర్ఆర్ఆర్’ గ్రాండ్ గా విడుదల కానున్నట్లు పెన్ మూవీస్ తెలియజేసింది. ఈ వేసవిలో సరైన సినిమాల లేక ఖాళీగా ఉన్న థియేటర్లను మళ్లీ ప్రేక్షకులతో నింపడంలో ‘ఆర్ఆర్ఆర్’ విజయవంతమవుతుందనే ఆశాభావంతో పెన్ మూవీస్ ఉంది.