నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటజీవితం లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు. వాటిలో ‘రోజులుమారాయి’ చిత్రం ఒకటి. ఆయన కెరీర్ బిగినింగ్ లో… అంటే.. 1955 లో విడుదలై.. సంచలన విజయం సాధించిన ఈ సినిమా నేటికి 65 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి తాపీ చాణక్య దర్శకుడు. బాలీవుడ్ నటీమణి వహిదా రహమాన్ నటించిన మొదటి సినిమాగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమాను బంజరు భూములను పేద రైతులకు పంచి పెడితే మేలు జరుగుతుందనే నేపథ్యంలో నిర్మించారు. పెత్తందార్ల వ్యవస్థలో భూస్వాములకు పేద రైతాంగానికి మధ్య జరిగే ఘర్షణ కథాంశంతో సినిమా నిర్మాణం జరిగింది. దీనిని 1950వ దశకంలో వచ్చిన విప్లవాత్మక చిత్రంగా అభివర్ణించవచ్చు. అధిక పంటలు పండించే పధకం క్రింద తీసుకున్న 200 ఎకరాలను అక్రమంగా కౌలుకిచ్చి రైతులవద్ద నుండి ధాన్యాన్ని దోచుకొంటూ ఉంటాడు సాగరయ్య (సియ్యస్సార్). ఒక సారి కోటయ్య బంజరు భూమిలో కష్టపడి పండించుకున్న పంటను అక్రమ తీర్పు ద్వారా తన పాలేరుకు సగం పంట వచ్చేలా చేస్తాడు సాగరయ్య. అతని అన్యాయాన్ని కోటయ్య కొడుకైన వేణు ఊరి జనాలతో కలసి ఎదిరించి అతనికి బుద్ధి చెప్పడమే రోజులు మారాయి చిత్ర కథ. షావుకారు జానకి, సియస్సార్, రేలంగి, రమణారెడ్డి, వల్లం నరసింహారావు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి మాస్టర్ వేణు సంగీత దర్శకుడు. ఏరువాగ సాగారోరన్నో చిన్నన్న పాట.. ఇప్పటికీ.. తెలుగు నాట మారుమోగుతునే ఉంది.