చిత్రం : ఆర్జీవీ దెయ్యం
నటీనటులు : రాజశేఖర్, స్వాతిదీక్షిత్, బెనర్జీ, ఆహుతి ప్రసాద్, అనిత చౌదరి, జీవా, తనికెళ్ల భరణి, సన, అనంత్ తదితరులు.
సంగీతం : డి.ఎస్.ఆర్
సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల
ఎడిటింగ్ : సత్య, అన్వర్
బ్యానర్ : నట్టీస్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత : నట్టికుమార్
దర్శకత్వం : రామ్గోపాల్ వర్మ
విడుదల తేది : 16-04-2021
వర్మ ఎప్పుడు చెప్పే మాటే కనిపించని దేవుడిని నమ్మను కానీ… ఉందో లేదో అని తెలిసి తెలియకుండానే భయపెట్టే దెయ్యాన్ని మాత్రం నమ్ముతానని… అలా తనకు భయపెట్టడమే ఇష్టం అంటూనే అప్పట్లో ‘దెయ్యం’ పేరుతో ఓ సినిమా చేశాడు. మరి ఈ సినిమా మాత్రం ఆరేళ్ల కిందటే మొదలెట్టిన ‘పట్ట పగలు’ పేరుతో రూపొందిన సినిమా. కొన్ని మార్పుల తర్వాత ‘ఆర్జీవీ దెయ్యం’గా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది..? రామ్గోపాల్ వర్మ కొత్త దెయ్యం మునుపటి దెయ్యంలా భయపెట్టిందా.. లేదా..? అనేది రివ్యూలో చూద్దాం…
కథ :
శంకర్ (రాజశేఖర్) ఓ కార్ మెకానిక్. తనకు కాలేజ్ కి వెళ్ళే కూతురు విజ్జీ (స్వాతి దీక్షిత్) ఉంటుంది. ఓ రోజు ఆమెలో క్రమంగా కలిగే మార్పుల్ని గమనిస్తాడు శంకర్. రాత్రిళ్లు నడవడం, గట్టిగా అరవడం, భయపడటం వంటివి చూశాక శంకర్ ఆందోళనకి గురవుతాడు. వైద్యుల్ని సంప్రదిస్తాడు. విజ్జీ ప్రవర్తన చూసి వాళ్లే షాక్ అవుతారు. మానవాతీత శక్తులు ఉన్నాయని గ్రహిస్తారు. క్రమంగా సైకో కిల్లర్ గురులా మాట్లాడటం మొదలుపెడుతుంది. ఆ తర్వాత ఆ ఊళ్లో జరిగే హత్యలన్నింటికీ తానే కారణం అని చెబుతుంది. నిజంగా విజ్జీ ఆ హత్యలకి పాల్పడిందా..? సైకో కిల్లర్ గురుకీ, ఆమెకీ సంబంధమేమిటి..? అనేది మిగతా కథ.
కథనం :
ఆత్మ ఆవహించిన ఓ అమ్మాయి కథే ఈ చిత్రం. ఆత్మలు తాము ఆవహించడానికి ఎలాంటి శరీరాల్ని ఎంచుకుంటాయి..? వాటిని ఎలాంటి ప్రయత్నాల ద్వారా భూత వైద్యులు వెళ్లగొడుతుంటారనే విషయాల్ని రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రస్తావిస్తూ ఈ సినిమాని తీర్చిదిద్దారు. పట్టపగలు… చుట్టూ మనుషుల్ని చూపెడుతూ ప్రేక్షకుల్లో భయం పుట్టేలా ఆరంభ సన్నివేశాల్ని తీర్చిదిద్దారు దర్శకుడు. అందుకే ఈ సినిమాకి మొదట పట్టపగలు అని పేరు పెట్టాలనుకున్నారేమో. విజ్జీ తనకొచ్చే కలలతో నిత్యం భయపడుతూ, ఆందోళన చెందుతూ కనిపిస్తుంటుంది. ప్రథమార్ధం అంతా దాదాపుగా ఇదే తంతు. తెరపై కనిపించేది ఏది నిజం..? ఏది కల అనే గందరగోళం కూడా కొన్నిచోట్ల తలెత్తుతుంది. ఇందులో కథేమీ లేదు. ద్వితీయార్ధంలో ఆత్మ లక్ష్యమేమిటి..? విజ్జీనే ఎందుకు ఎంచుకుందనే విషయాల్ని దెయ్యంతోనే చెప్పిస్తారు. విజ్జీ శరీరంలోకి ప్రవేశించిన ఆత్మ ఎవరిది..? ఎందుకలా చేస్తోందనే ఆసక్తి చివరి వరకు కొనసాగేలా చేశాడు దర్శకుడు. ఆ ఆత్మ కథ కూడా ద్వితీయార్ధంలో ఫ్లాష్బ్యాక్గా ఉంటుందేమో అనిపించినా… అదేమీ లేకుండా సినిమాని పూర్తిచేశారు. రామ్ గోపాల్ వర్మ మార్క్ కెమెరా కోణాలు, ఆయన మార్క్ భీకరమైన శబ్దాలతో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు భయపెడతాయంతే.
నటీనటుల పెర్ఫార్మెన్స్ :
రాజశేఖర్ ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రిగా కనిపించారు. తెరపై సహజంగా కనిపించడం తప్ప… ఆయనకి నటించేందుకు పెద్దగా స్కోప్ లేని పాత్ర ఇది. తన కూతురికి ఎందుకిలా జరుగుతోందని నిత్యం ఆందోళనతో కన్నీళ్లు కారుస్తూ, ఆత్మ ఆవహించినప్పుడు ‘ఏం కాలేదమ్మా…’ అని ఓదారుస్తూ కనిపిస్తుంటారంతే. స్వాతిదీక్షిత్ నటనే ఈ చిత్రానికి హైలెట్. ఆమె ఆత్మ ఆవహించిన యువతిగా చక్కటి అభినయం ప్రదర్శించింది. మగాడిలాగా, తన తల్లిలాగా, కొన్ని సన్నివేశాల్లో విజ్జీలాగా మాట్లాడుతూ హావభావాలు ప్రదర్శించిన విధానం మెప్పిస్తుంది. స్వాతి నటన మినహా సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు అనిపిస్తాయి. అనిత చౌదరి, తనికెళ్ల భరణి, అనంత్, సన తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. కొన్నేళ్ల కిందటే మరణించిన ఆహుతి ప్రసాద్, దేవదాస్ కనకాల వంటి నటులు ఈ సినిమాలో కనిపిస్తారు. ఇదెంత పాత సినిమా అనే విషయాన్ని గుర్తుచేస్తుంటాయి వారి పాత్రలు.
సాంకేతిక విభాగం :
సతీష్ ముత్యాల కెమెరా పనితనం, డి.ఎస్.ఆర్ సంగీతం మెప్పిస్తుంది. రామ్గోపాల్ వర్మ ఎంచుకున్న ఈ కథలో కానీ, కథనంలో కానీ కొత్తదనం లేదు. సన్నివేశాలు కూడా ఇదివరకు చూసేసిన హారర్ సినిమాల్ని గుర్తు చేస్తుంటాయి.
చివరిగా : అప్పటి ‘దెయ్యం’లా భయపెట్ట లేదు ఇప్పటి ఆర్జీవీ ‘దెయ్యం’
రేటింగ్ : 2/5
గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే