ఆకర్షించే అందం.. అందమైన అభినయం.. చిరునవ్వు చిగురించే మోము.. ఆకట్టుకొనే ప్రవర్తన, అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం.. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగే ప్రతిభ..  పాత్రలో పరకాయ ప్రవేశం చేసే కెపాసిటీ ఆమె సొంతం. పేరు రేవతి. ఒకప్పుడు దక్షిణాదిన మెరిసిన అందాల నక్షత్రం. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు చేసి తన స్థాయిని పెంచుకొన్న కథానాయిక. ఓ పక్క గ్లామర్ పాత్రలు పోషిస్తూనే… మరో పక్క అభినయం ప్రాధాన్యం గల పాత్రల్లోనూ మకుటం లేనే రారాణిగా రాణించారు రేవతి. ఆపై  దర్శకురాలిగానూ  సత్తా చాటుకుంది ఆమె.  ప్రతిభకు గుర్తింపుగా ఆమెకి అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయి. క్లిష్టతరమైన పాత్రల్ని పోషించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. జాతీయ స్థాయిలో సినిమా రంగానికి చెందిన మూడు విభిన్న విభాగాల్లో అవార్డులు స్వీకరించారు.

కేరళలోని కొచ్చీలో జన్మించిన రేవతి..  భారతీరాజా మణ్ వాసనై ( తెలుగులో మంగమ్మగారి మనవడు) చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే తన అందంతోనూ , అభినయంతోనూ కట్టిపడేసిన ఆమె.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. తమిళనాట అందరు అగ్రహీరోల సరసన నటించి సత్తా చాటుకున్నారు. అలాగే తెలుగు చిత్రాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. అలాగే మదర్ టంగ్ మలయాళంలో అభినయ  ఫ్రాధాన్యం  కలిగిన ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. దర్శకురాలిగా రేవతి అనుపమానమైన ప్రతిభ కనబరిచారు. దర్శకత్వం వహించినవి నాలుగు సినిమాలే అయినా…వాటిలో ఓ ఆంగ్ల చిత్రం, రెండు హిందీ చిత్రాలు, ఒక మలయాళ చిత్రం ఉన్నాయి. ఇక చలన చిత్ర సీమకి అందించిన సేవలకు గుర్తింపుగా రేవతి పలు అవార్డులు అందుకున్నారు. ముచ్చటగా మూడుసార్లు జాతీయ పురస్కారాలు స్వీకరించారు. నేడు రేవతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!