Remake of the day : మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో అత్యత్తమమైన చిత్రాల్లో పున్నమినాగు ఒకటి. ఆయన కెరీర్ బిగినింగ్ లో నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడమే కాకుండా.. ఆయనకి మొట్టమొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తెచ్చిపెట్టింది. ఏవీయమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏవీ మెయ్యప్పన్ ఈ సినిమాను నిర్మించారు. రాజశేఖర్ దీనికి దర్శకుడు. నరసింహరాజు మెయిన్ హీరోగా నటించగా. రతి అగ్నిహోత్రి, మేనక హీరోయిన్స్ గా నటించారు. ధూళిపాళ, మిక్కిలినేని, పద్మనాభం, జయమాలిని, రామదాసు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
చిన్నతనం నుంచి తను తినే ఆహారంలో కొంచెం కొంచెం విషం కలిపి తినిపిస్తుంటాడు నాగులు తండ్రి. పాములు పట్టుకొనే తమ వృత్తికి అది సురక్షితమైన మార్గమని నాగులు తండ్రి భావిస్తాడు. పెరిగి పెద్దవాడైన నాగులు ప్రతీ పున్నమికి .. తనకు తెలియకుండానే .. కొంతమంది అమ్మాయిల చావుకు కారణమవుతాడు. తనకున్న ఈ లక్షణంతో నాగులు చివరికి ఏం చేశాడు అన్నదే ఈ సినిమా కథాంశం. నాగులుగా చిరంజీవి నటన నభూతో నభవిష్యతి. ఆయన తండ్రిగా తమిళ నటుడు రామదాసు నటించారు.
నిజానికి ‘పున్నమినాగు’ చిత్రం రాజశేఖర్ దర్శకత్వంలోనే కన్నడలో రూపొందిన ‘హుణ్ణిమెయ రాత్రియల్లి’ సినిమాకి రీమేక్ వెర్షన్. లోకేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అవడంతో దీన్ని తెలుగులో పున్నమినాగుగా తెలుగులో రీమేక్ చేశారు.