ఆయన విప్లవానికి ప్రతినిథి. సమసమాజ నిర్మాణం కోసం తన సినిమాలతో యువతలో చైతన్యాన్ని రగిల్చిన అగ్నికణం. కమ్యూనిస్ట్ భావజాలాన్ని నిలువెల్లా నింపుకొని .. బడుగు వర్గాల వారికి ఆశాజ్యోతిగా నిలిచిన ఎర్ర సూర్యుడు. పేరు మాదాల రంగారావు. అవినీతి, అణిచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారు. నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించారు. ‘మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవశంఖం, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి, ఎర్రపావురాలు, స్వరాజ్యం, జనం మనం లాంటి సినిమాల్లో నటించి…. తెలుగు వెండితెరమీద విప్లవ శంఖం పూరించారు.
మాదాల రంగారావు ప్రకాశం జిల్లా మైనం పాడు మాదాల స్వగ్రామంలో జన్మించారు. ప్రజా నాట్యమండలి లో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. మరో ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ, నిర్మాత పోకూరి బాబురావు ఈయన సహోధ్యాయిలు. రంగారావు కొడుకు మాదాల రవి. తండ్రి సినిమాల్లో బాల నటుడిగా నటించారు. 1980-90 దశకంలో సామాజిక విప్లవ సినిమాలతో తెరపై సంచలనం సృష్టించారు మాదాల రంగారావు. తాను నిర్మించిన చిత్రాల ద్వారా వచ్చిన లాభాన్ని సీపీఎం పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇచ్చేవారు మాదాల. ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాల్లోని థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా వచ్చిన లాభాన్ని స్థానిక సీపీఎం కార్యాలయాలకు అందించేవారు. మారుతున్న పరిస్థితుల్లో కూడా నమ్ముకొన్న సిద్ధాంతాలను తుదిశ్వాస వరకు విడవలేదు. చైర్మన్ చెలమయ్య మాదాల మొదటి సినిమా. నవతరం ప్రొడక్షన్స్ పతాకంపై ఈయన 1980 లో తీసిన యువతరం కదిలింది సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది పురస్కారం లభించింది. నవతరం పిక్చర్స్ బ్యానర్లో సినిమాలు నిర్మించిన మాదాల, ఎక్కువగా విప్లవ భావాలు కలిగిన చిత్రాలనే తీశారు. నేటి తరంలో విప్లవ సినిమాలకు చిరునామాగా నిలిచిన ఆర్ నారాయణమూర్తికి మాదాల స్పూర్తిగా నిలిచారు. నేడు మాదాల రంగారావు వర్ధంతి. ఈ సందర్భంగా ఆ ఎర్రసూర్యుడికి నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.