సరిగమలతో సావాసం చేశారు.. రాగాలతో కలిసి ప్రయాణించారు. గీతాలతో తన జీవితాన్ని వేగంగా పరుగులు తీయించారు . ఆయన పేరు ఆర్డీ బర్మన్. బాలీవుడ్ లో ప్రసిద్ధి గాంచిన సంగీత దర్శకడు. తన మధురమైన బాణీలతో ఎన్నో పాటల్ని శ్రోతలకు, సంగీత ప్రియులకు వినవిందు చేశారు. మూడు దశాబ్దాల పాటు హుషారైన పాటలెన్నో స్వరపరిచిన ఈయన దాదాపు సుమారు 331 చిత్రాలకు బాణీలను సమకూర్చారు.
ప్రముఖ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ కుమారుడు ఆర్డీ బర్మన్ . కొత్త ఒరవడి సృష్టించిన స్వరకర్త, గాయకుడు. పాటల్ని ‘డిస్కో’, ‘రాక్’ వంటి కొత్తపుంతలను తొక్కించి భారతీయ సినిమా రంగాన్ని ఓలలాడించాడు. తెలుగు, తమిళ, మళయాళ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషల చిత్రాలకూ సంగీతాన్ని అందించారు. వైవిధ్య భరితంగా సీసాలతో, వెదురు బొంగులతో, గరుకు కాగితాలతో కూడా సంగీతాన్ని సృష్టించారు. తండ్రి ఎస్‌డీ బర్మన్ వద్ద కొంతకాలం సహాయకుడిగా పనిచేశాడు. బెంగాలీ అయినప్పటికీ బర్మన్‌కు హిందీ చిత్రాలంటే మక్కువ. తెలుగులో ‘అంతం’ సినిమాకు సహాయ సంగీత దర్శకులుగా బర్మన్ వద్ద కీరవాణి, మణిశర్మలు పనిచేశారు. డార్జిలింగ్‌లో షూటింగ్ సమయంలో పరిచయమైన అభిమాని రీతూపటేల్‌ను వివాహం చేసుకొన్నా, ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. 1980లో గాయని ఆశాభోస్లేను వివాహం చేసుకొన్నారు. బర్మన్ సంగీతం సమకూర్చిన మొదటిచిత్రం ‘తీస్రీమంజిల్’. ఆపై పడోసన్ లాంటి సినిమాల్లోని పాటలు అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. 1980 వరకు బర్మన్ ప్రస్థానం సాగింది. ఆయన స్వరాలు సమకూర్చిన ఆఖరు చిత్రం ‘1942 ఎ లవ్ స్టోరీ’ (1994). ఈ సినిమా ఆయన మరణించిన తరువాత విడుదలైంది. 2013లో భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది. నేడు ఆర్డీ బర్మన్ జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.