Raviteja : మాస్ మహారాజా రవితేజ హీరోగా, నూతన దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సోమవారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్‌లో రవితేజతో పాటు మిగతా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ లక్ష్మణ్ భేరి అనే ఆర్‌పీఎఫ్ అధికారిగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ప్రచారం ఇప్పటికే మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం ప్రణాళికలు చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.