‘పంతులమ్మ, జమీందారుగారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, రామచిలుక, అందమే ఆనందం, ఇంటింటి రామాయణం’..ఈ సినిమా పేర్లు వినగానే  మన కళ్ళ ముందు ఒక చక్కటి హీరో కదలాడుతారు. చూడగానే ఆకట్టుకొనే రూపం… మంచి ఒడ్డు పొడుగు.. గంభీరమైన కంఠస్వరం.. హుందాదనం ఉట్టిపడే నటన. తనకు మాత్రమే సాధ్యమయ్యే మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ తో ఆయన ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించారు. ఆయన పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్.  స్క్రీన్ నేమ్ రంగనాథ్.

బాపు రమణల ‘బుద్దిమంతుడు’ చిత్రంలో చిన్న పాత్ర ద్వారా రంగనాథ్‌ సినీ రంగప్రవేశం చేసారు. ఆ తరువాత హీరోగా ‘చందన’ సినిమాతో పూర్తి నిడివిగల పాత్రలో నటించారు. సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీలో ఆ రకమైన సానుకూల స్పందన రావడంతో… చిత్రసీమలో నిలదొక్కుకోగలననే నమ్మకం రంగనాథ్‌లో కలిగింది. చందన విడుదలైన వెంటనే ప్రతాప్‌ ఆర్ట్స్‌ అధినేత రాఘవ చిత్రం ‘చదువు సంస్కారం’ సినిమాకు ఓకే చెప్పారు. తరువాత మల్లెమాల చిత్రం ‘రామయ్య తండ్రి’, ఆయన బంధువు నిర్మించిన మరో చిత్రం ‘వైకుంఠపాళి’, నవతా కృష్ణంరాజు ‘జమీందాగారమ్మాయి’…ఇలా వరుస సినిమాలు ఆయన ముందు క్యూ కట్టాయి. అంతే… రంగనాథ్‌ మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘అమెరికా అమ్మాయి’, ‘అందమే ఆనందం’, ‘సెక్రెటరీ’, ‘దేవతలారా దీవించండి’, ‘పంతులమ్మ’, ‘రామచిలుక’, ‘తాయారమ్మ బంగారయ్య’, ‘ఇంటింటి రామాయణం’, ‘మావూరి దేవత’, ‘ప్రియబాంధవి’, ‘లవ్‌ ఇన్‌ సింగపూర్‌’, ‘గృహ ప్రవేశం’, ‘ఖైదీ’, ‘ఆలయ శిఖరం’, ‘ఆడవాళ్లు అలిగితే’, ‘ఈ చదువులు మాకొదు’్ద….ఇలా చాలా సినిమాల్లో నట ప్రతిభ కనబరిచారు. ‘మెరుపు దాడి’, ‘విజేత’, ‘అడవి దొంగ’ చిరంజీవి ‘ఎడడుగుల బంధం’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘వేట’, ‘దొంగమొగుడు’, ‘గాంధీ నగర్‌ రెండో వీధి’, ‘భలే మొగుడు’, ‘విశ్వనాధ నాయకుడు’…ఇలా ఎన్నో చిత్రాల్లో నటించారు. రంగనాథ్ ఆఖరి చిత్రం వెంకటేశ్ , పవన్ కళ్యాణ్ నటించిన గోపాలా గోపాలా. నేడు రంగనాథ్ జయంతి. ఈ సందర్భంగా ఆ విలక్షణ నటుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్. 

 

 

Leave a comment

error: Content is protected !!