”లక్కుతో శివ సినిమా తీసి…

షోలేని చెడగొట్టి…

పిచ్చవాగుడు వాగేవాడు డైరెక్టరా వర్మ

హిచికాక్‌ సినిమాలు చూసి…

దెయ్యాల సినిమాలు తీసే రామ్ గోపాల్‌ వర్మా… డైరెక్టరా ఖర్మ”

ఇది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘కథ స్క్రీన్ ప్లే అప్పలరాజు’ సినిమాలోని టైటిల్ సాంగ్ లో ఆయన మీదే ఆయనే కోరి మరీ రాయించుకున్న ఓ సెటైరికల్ లిరిక్స్.

అవును… ఒకప్పుడు వర్మ అంటే ఓ సంచలనం కానీ ప్రస్తుతం కాంట్రవర్షిలతో నిత్యం వార్తలో నిలిచే ఓ వివాదం. ఎప్పుడు ఎవరి మీద పన్నీరు జల్లుతారో… ఎవరిమీద బురద జల్లుతారో… తెలియదు. ‘నాకిక్కడ ఏమనిపిస్తే అది చేస్తే… ఇక్కడేదనిపిస్తే అది మాట్లాడతా…’ అనే ఈ డైలాగ్ ఆర్జీవీకి శిష్యుడైన పూరీ రాసినప్పటికి వర్మ మాత్రం నూటికి నూరు శాతం ఇదే టైప్. ఎవరెన్ని అనుకున్నా తాను అనుకున్నది అనేస్తాడు… తీయాల్సింది తీసేస్తాడు… కాంట్రివర్శీలకు కేర్ ఆఫ్ అడ్రస్ తానై… వాటితోనే తన సినిమాలకి ఫ్రీగా ప్రమోషన్స్ పబ్లిసిటి చేస్తూ… దట్ ఈజ్ వర్మ అనేస్తాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆర్జీవీని గురించిన ఆసక్తికరమైన విషయాలు…

రామ్ గోపాల్ వర్మ 1962లో తూర్పుగోదారి జిల్లాలో కృష్ణంరాజు, సూర్యమ్మ దంపతులకు జన్మించారు. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. ఆ సమయంలో విపరీతంగా సినిమాలను చూసి… తర్వాత ఆ సినిమా కథలను తనదైన శైలిలో స్నేహితులతో చర్చిస్తూ… సినిమాలకు బాగా ఆకర్షితుడు అయ్యాడు. తనలో ఎలాగైనా సినిమా తీయాలనేంత కసి పెరిగింది. అలా అవకాశాల కోసం ఎదురుచూసే సమయంలోనే హైదరాబాద్‌ లో వీడియోలను అద్దెకిచ్చే షాపు పెట్టారు. అందులో అమితాబ్ బచ్చన్ సినిమాలను పైరసీ చేసే తను ఆ బిగ్ బి నే డైరెక్ట్ చేసే స్థాయికి చేరుకున్నానని ఓ సందర్భంలో చెప్పాడు.

‘శివ’ అవకాశం :

ఆ విధంగా హైదరాబాద్ వచ్చిన వర్మ తర్వాత సినీ పరిశ్రమలోని వారితో పరిచయాలు పెంచుకుని, ఒకటి, రెండు సినిమాలకు సహాయకుడిగా కూడా పనిచేశారు. ఈ దశలోనే ‘రాత్రి’ సినిమా తీయాలని అనుకున్నారు. అయితే ఆ సినిమా చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ‘శివ’ కథను సిద్ధం చేసి నాగార్జునకు వినిపించారు. ఆ కథను నచ్చి నాగార్జున ఒకే అనడంతో వెండితెరపై ‘ఏ ఫిలిం బై – రామ్ గోపాల్ వర్మ’ అని చూసుకోవాలనే తన కల నెరవేరింది.

‘శివ’ సినిమా ప్రస్తావన వస్తే మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ ‘శివ’కు ముందు… ‘శివ’కు తర్వాత అంటూ కొనియాడేల అత్యున్నత స్థాయి విజయం అందుకుంది. అలాగే వర్మ ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. వర్మకు ఈ సినిమా విజయం చాలా పాపులారిటిని తీసుకు వచ్చింది.

టాలీవుడ్ వర్మ మార్క్ ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ :

‘శివ’ తర్వాత చేసిన ‘క్షణ క్షణం’ లోని వర్మ టేకింగ్‌ స్టైల్‌కు చిత్ర పరిశ్రమ మరోసారి ఫిదా అయిపోయింది. కీరవాణి స్వరపరిచిన ‘జామురాతిరి జాబిలమ్మ…’ పాట తెలుగునాట ఇప్పటికి మారుమోగుతూనే ఉంది. అయితే ఆ తర్వాత చేసిన ‘అంతం’ నిరాశ పరచడంతో తొలి అవకాశం కోసం సిద్దం చేసుకున్న ‘రాత్రి’ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టి సరికొత్త అనుభూతిని ఇచ్చారు. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. జగపతిబాబుతో తీసిన ‘గాయం’ కూడా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. కామెడీ జోనర్‌లో వచ్చిన ‘మనీ’, ‘మనీ మనీ’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టాయి. కేవలం దర్శకుడిగానే కాకుండా వర్మ నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మించి అభిరుచి ఉన్న దర్శకుడు అనిపించుకున్నారు.

వర్మ వెరైటి ఆఫ్ జోనర్స్ :

వర్మ లవ్… ఎమోషన్… హర్రర్… యాక్షన్… మాఫియా… రొమాన్స్… సెక్స్… ఇలా ఏ కోణం తీసుకున్నా ఆయన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక పర్పస్ ఉంటుంది. నాటి ‘శివ’ దగ్గర నుండి నిన్నటి ‘డి-కంపెని’ వరకూ వర్మ డైరెక్షన్ అండ్ టేకింగ్ అంతర్లీనంగా ఏదో ఒక మెసేజ్ ఉండనే ఉంటుంది. ‘గోవింద… గోవింద…’, ‘మనీ’, ‘సత్య’, ‘గాయం’, ‘సర్కార్’, ‘రక్త చరిత్ర’, ‘గాడ్ అండ్ సెక్స్ అండ్ ట్రూత్’ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ఓ ఐడెంటిటీని సంపాదించుకున్నారు.

బాలీవుడ్‌లో పాగా వేసిన వర్మ :

టాలీవుడ్ లో ప్రతిభా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వర్మ మెగాస్టార్ చిరంజీవి హీరోగా అశ్వినీదత్ నిర్మాతగా ఓ సినిమా మొదలైనప్పటికి వర్మ కొంతభాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాని వదిలిపెట్టి బొంబాయిలో పాగా వేసేందుకు వెళ్ళిపోయాడు.

అలా చేసిన  ‘రంగీలా’ బాక్సాఫీస్‌ వద్ద చక్కని విజయాన్ని నమోదు చేసింది. బాలీవుడ్ లో ప్రేమకథలు, యాక్షన్‌ చిత్రాల హావా నడుస్తున్న సమయంలో వర్మ తీసిన సినిమాలు నిజజీవితానికి దగ్గరగా ఉండటం, విషయాన్ని లోతుగా అన్వేషించి చెప్పడం అక్కడి వారికి బాగా నచ్చింది. అయితే తీసే ప్రతీ చిత్రంలో తనదైన మార్కును చూపేవారు వర్మ. ‘సత్య’, ‘జంగిల్‌’, ‘కంపెనీ’, ‘భూత్‌’, ‘నాచ్‌’, ‘సర్కార్‌’, ‘సర్కార్‌ రాజ్‌’, ‘సర్కార్‌ 3’, ‘డిపార్ట్మెంట్’, ‘ది అటాక్స్‌ ఆఫ్‌ 26/11’ తదితర చిత్రాలతో బాలీవుడ్‌లో వర్మ మంచి పేరు తెచ్చుకున్నారు.

‘వివాదమే’ వర్మ ఇంటిపేరు :

విభిన్న చిత్రాలతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో… వివాదాలతోనూ అదే స్థాయిలో నిలిచారు వర్మ. అమెరికా నుంచి అమలాపురం వరకూ… ఢిల్లీ నుంచి గల్లీ వరకూ… స్టార్‌ నుంచి సూపర్‌ స్టార్‌ వరకూ ఎవర్నీ వదిలిపెట్టరు. తాను తెరకెక్కించిన సినిమాల విషయంలో ఎవరి మాట వినరు. బెదిరింపులకు అసలు భయపడడు. ఎవర్ని పొగిడినా, ఎవర్ని తిట్టినా ‘అతిలోక సుందరి’ శ్రీదేవిని మాత్రం ఇప్పటికి ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా అని అంటాడు వర్మ.

విశ్వ వ్యాప్తమైన వర్మ :

వర్మకు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ స్లమ్ డాగ్ మిలినీయర్స్ డైరెక్టర్ డేనీ బోయల్ లాంటి డైరెక్టరే తనపై వర్మ ప్రభావం ఉందని చెప్పాడంటే డైరెక్టర్ గా తన విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అవార్డుల ఆర్జీవీ :

రామ్ గోపాల్ వర్మకు తను తీసిన సినిమాలకు గానూ ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘శివ’ కు, ‘క్షణ క్షణం’, ‘ప్రేమకథ’ చిత్రానికి ఇలా మూడుసార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు. ‘రంగీలా’, ‘సత్య’ చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా వర్మను అవార్డులు వరించాయి.

చివరిగా :

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంతవరకు ఎవరో ఒకరిని గిల్లకపోతే ప్రశాంతంగా నిద్ర పట్టని వర్మను కొంతమంది పిచ్చోడు అంటారు. మరికొంతమంది గట్టోడు అంటారు. తిట్టే వాళ్లు తిట్టినా… పొగిడేవాళ్లు పొగిడినా… వర్మ క్యారెక్టర్ ఇది అని చెప్పలేం. ఎందుకంటే ప్రపంచమంతా ఎడ్డెం అంటే ఆర్జీవీ ఒక్కడు మాత్రం తెడ్డెం అంటాడు. సినిమా పరిశ్రమలో గొప్ప గొప్పదర్శకులు అందరూ ఆయన శిష్యులే. ‘వర్మ’ ఉండటం మన ‘ఖర్మ’ అని కొందరు విమర్శిస్తుంటారు. మరికొందరు వర్మ సినిమాకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ‘విశ్వకర్మ’ అంటారు.

బర్త్ డే అంటే అది ఒక హ్యాపి డే కాదు.. వాస్తవానికి అది డెత్‌ డే..ను గుర్తుచేసే రిమైండర్ ఎందుకంటే ఆయుష్షులో ఒక సంవత్సరం తగ్గిపోతుంది కదా..! అనేది ఆర్జీవీ అభిప్రాయం. దీనికి సంబంధించి “ఈ రోజు నా బర్త్ డే కాదు… వాస్తవానికి నా డెత్‌ డే… ఎందుకంటే నా ఆయుష్షులో ఇక సంవత్సరం తగ్గిపోయింది” అంటూ తాజాగా భోరున విలపిస్తూ ఓ ట్వీట్ చేశాడు వర్మ. ఇటువంటి మనస్తత్వం ఉన్న వర్మకి బర్త్ డే విషెస్ చెప్పాలో వద్దో తెలియక భవిష్యత్తులో వివాదాలతో కాకుండా మునపటిలా సంచలనం కలిగించే మార్క్ సిగ్నేచర్ తో కూడిన చిత్రాలను డైరెక్ట్ & ప్రొడ్యూస్ చేయాలని ఆశిస్తూ…  చెప్పి చెప్పనట్లుగా ఆయన స్టైల్ లోనే విష్ చేస్తుంది మూవీ వాల్యూం.

 

 

Leave a comment

error: Content is protected !!