ఆరడుగులు ఉంటాడు. అందంగా ఉంటాడు. అందుకే బాలీవుడ్ లో ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. ఆ కారణంగానే బాలీవుడ్ లో ఆయన తొలి సూపర్ స్టార్ గా అవతరించాడు. ఆయన పేరు రాజేష్ ఖన్నా.ఆయన బస చేసిన హోటల్స్ ముందు వందలాది మంది అమ్మాయిలు క్యూ కట్టి నిలబడిన స్టార్డమ్ ఆయనది. అభిమానులు ఆయన కారును ముద్దులతో ముంచెత్తిన ప్రాచుర్యం ఆయనది.
అమ్మాయిలు రక్తంతో ఉత్తరాలు రాసిన చరిత్ర రాజేష్ ఖన్నా ది . ఓసారి హౌరా బ్రిడ్జి దగ్గర పడవలో షూటింగ్ జరపడానికి అధికారులు అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? అతడిని చూడ్డానికి వచ్చే అభిమానుల వల్ల హౌరాబ్రిడ్జి కుప్పకూలిపోతుందనే భయం చేత! బీబీసీ వాళ్లు అతడి మీద ‘బాంబే సూపర్ స్టార్’ పేరుతో ఓ సినిమా తీశారు. రాజేష్‌ఖన్నా నటించిన 168 సినిమాల్లో అత్యధిక భాగం హిట్లే. నటుడిగా, నిర్మాతగానే కాక లోక్‌సభ సభ్యుడిగా కూడా ఎదిగిన రాజేష్ ఖన్నా ప్రస్థానం 1966లో ‘ఆఖరీ ఖత్’తో మొదలైంది. ప్రతిష్టాత్మకమైన ‘పద్మభూషణ్’ అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలు అతడి సొంతం. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టిన రాజేష్ ఖన్నా 1965లో నిర్మాతలు నిర్వహించిన టాలెంట్ హంట్‌లో పదివేల మందిలో ఒకడుగా నిలిచి, గెలిచారు. ఆయన నటించిన సినిమాలను, వాటిలోని పాటలను అభిమానులు ఎప్పటికీ మరువలేరు. ‘బాబీ’ సినిమాలో నటించిన డింపుల్ కపాడియాను 1973లో ఆ సినిమా విడుదలకు ఎనిమిది నెలల ముందు పెళ్లాడిన రాజేష్‌ఖన్నాకు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా కూతుళ్లు. నేడు రాజేశ్ ఖన్నా వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.