బాపు, రమణ కలయికలో రూపొందిన అత్యద్భుత చిత్రాల్లో ‘రాధాకళ్యాణం’ ఒకటి. చంద్రమోహన్, రాధిక జంటగా నటించిన ఈ సినిమా 1981లో విడుదలైంది. శరత్ బాబు, కాంతారావు, రావికొండలరావు, పుష్పలత, సాక్షిరంగారావు, ప్రసాదరావు తదితరులు నటించిన ఈ ప్రేమకథా చిత్రం అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. మాధవన్ అనే ఓ తమిళ అబ్బాయికి, రాధ అనే అమ్మాయికి మధ్య చిగురించిన ప్రేమ ను రాధ తండ్రి ఒప్పుకోడు. ఫలితంగా ఆమె ఒక డబ్బున్న ఇంటికి కోడలు అవుతుంది. అయితే మాధవన్ మీద ప్రేమమాత్రం పోదు. ఆ విషయం శోభనం రోజున రాత్రే గమనించిన రాధ భర్త.. ఆమెను మళ్లీ మాధవన్ తో పంపించేయాలనుకుంటాడు. అయితే దానికి మాధవన్ ఒప్పుకోక.. ఆమెను తన భర్తతోనే కలిపి వెళ్ళిపోతాడు.
నిజానికి ఈ సినిమా భాగ్యరాజ్ హీరోగా .. ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘అంద ఏళు నాట్కళ్’ తమిళ చిత్రానికిది రీమేక్ వెర్షన్. ఇదే సినిమాను ఆ తర్వాత బాపు వో సాథ్ దిన్ గా హిందీలోనూ తెరకెక్కించారు. అలాగే ఈ సినిమా కన్నడలో కాశీనాథ్ హీరోగా లవ్ మాడి నోడు గా రీమేక్ అయి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. కె.వి.మహాదేవన్ సంగీతం అందించిన రాధా కళ్యాణం చిత్రంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.