చిరంజీవి .. స్టార్ హీరోగా ఎదగడానికి, ఆపై మెగాస్టార్ అవ్వడానికి ఎన్నో చిత్రాలు దోహదపడ్డాయి. అలాంటి వాటిలో అభిమానులు ఎప్పటికీ గుర్తుపెట్టుకొనే చిత్రం ‘పున్నమినాగు’. కెరీర్ బిగినింగ్ లో చిరు చేసిన ఒక గొప్ప ప్రయోగంగా ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. జూన్ 13, 1980న విడుదలైన ఈ సినిమా నేటికి సరిగ్గా 41 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఏవీయమ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించారు. అయినప్పటికీ ఈ సినిమాకి హీరో చిరంజీవి అనే చెప్పాలి. ఎందుకంటే టైటిల్ .. ఆయన పాత్ర నే సూచిస్తోంది కాబట్టి.

నాగులు తండ్రి పాములు పట్టుకొని ఆడిస్తూ ఉంటాడు. పాముల వల్ల ఎప్పటికైనా తన కొడుకుకీ ప్రమాదమని భావించిన అతడు.. నాగులుకు చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెంగా విషాన్ని అలవాటు చేస్తాడు. దాంతో అతడు యవ్వనంలోకి అడుగుపెట్టే సమయానికి అతడి శరీరం పూర్తిగా విషమయం అవుతుంది. ఆ విషయం అతడికి తెలియక పోవడం కథలోని ప్రధాన ట్విస్ట్ . ప్రతీ పున్నమికి అతడిలో కామోద్దీపనం చెలరేగుతుంటుంది. ఆ టైమ్ లో అతడు ఏ అమ్మాయితో కలిస్తే ఆ అమ్మాయి .. అతడి శరీరంలోని విష ప్రభావానికి చనిపోతూ ఉంటుంది. ఆ క్రమంలో తను ప్రేమించిన అమ్మాయి కూడా బలైపోతుంది. చివరి నిమిషంలో ఆ విషయం తెలిసిన నాగులు .. తనను తాను అసహ్యించుకొని ఆత్మహత్య చేసుకోవడమే ఈ సినిమా కథ.  పాములా మారిన పాత్రలో చిరంజీవి నటన నభూతో నభవిష్యత్తు అనే విధంగా ఉంటుంది. ముఖ్యంగా.. తనెవరో తెలిసిన సమయంలో .. అతడి శరీరం మీద పొరలు ఊడే సన్నివేశం అద్భుతం. అలాగే.. ముంగిస తనమీద అటాక్ చేసినప్పుడు పాములా చిరు భయపడే సన్నివేశం కూడా అమోఘం. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలో పున్నమిరాత్రి… పాటైతే.. ఇప్పటికీ సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటూంటుంది. ఈ పాట చిత్రీకరణ అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో భయపెట్టేది కూడా. మొత్తం మీద మెగాస్టార్ తన కెరీర్ బిగినింగ్ లోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో ప్రయోగం చేసి శభాష్ అనిపించుకున్నారు. సో.. ‘పున్నమినాగు’ చిత్రం ఎప్పటికీ మెగాస్టార్ కెరీర్ లోనే అద్భుతమైన చిత్రం.

 

 

Leave a comment

error: Content is protected !!