మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘పులి’. వెంకటకృష్ణా ఫిల్మ్స్ బ్యానర్ పై ఆనంగోపాలకృష్ణారెడ్డి నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు రాజ్ భరత్ . 1985 లో విడుదలైన ఈ సినిమా 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రాధ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఇంకా.. రావుగోపాలరావు , అల్లురామలింగయ్య, శుభలేఖ సుధాకర్, నూతన్ ప్రసాద్, రాజేంద్రప్రసాద్ , సంయుక్త, సుదర్శన్, అన్నపూర్ణ, సిల్క్ స్మిత తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. ఈ సినిమా అప్పట్లో శతదినోత్సవం జరుపుకుంది.
సిన్సియర్ పోలీసాఫీసర్ క్రాంతికి ఒక్కగానొక్క చెల్లెలు లక్ష్మి. ఒకసారి అనుకోకుండా.. లక్ష్మి, ఆమె భర్త ఒక మర్డర్ ను చూస్తారు. దాని కారణంగా ఆమె కళ్ళు , ఆమె భర్త ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఈ మర్డర్ కేసులో కరెప్టెడ్ పోలీసాఫీసర్ శ్యామ్ హస్తం ఉంటుంది. మరి క్రాంతి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసి దోషుల్ని ఎలా చట్టానికి పట్టించాడు అన్నది మిగతా కథ. అప్పట్లో ఈ సినిమాలోని చిరంజీవి స్టైలిష్ ఇంట్రో గురించి తెగ మాట్లాడుకొనేవారు. అలాగే అందులో ఆయన ఉపయోగించిన కారు కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. యమకింకరుడు తర్వాత దర్శకుడు రాజ్ భరత్ ఇది చిరంజీవితో తీసిన రెండో చిత్రం కావడం విశేషం.