ఆయన భారతీయ థియేటర్ కు ఆద్యుడు.. బాలీవుడ్ ప్రేక్షకులకు ఆరాధకుడు. అద్భుతమైన నటనాపటిమకు , అనితర సాధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు. ఆయన పేరు పృధ్విరాజ్ కపూర్. బాలీవుడ్ తెరమీద ఎన్నో ప్రయోగాలు చేసి.. ఎంతోమంది నటీనటుల్ని తెరకు పరిచయం చేసిన ద గ్రేట్ హీరో కమ్ డైరెక్టర్ రాజ్ కపూర్ తండ్రి ఆయన.
భారతీయ మొదటి టాకీ సినిమా ‘ఆలం ఆరా’ (1931) చిత్రంతో వెండితెరపై మెరిశారు పృధ్విరాజ్ కపూర్ . వీరి వంశంలోని ఐదు తరాలు సినిమా రంగంలో నటించాయి. పృథ్వీరాజ్ కపూర్ నటించిన చిత్రాల్లో ‘ఆలం ఆరా’, ‘విద్యాపతి’, ‘సికిందర్’, ‘ఆవారా’, ‘ఆనంద్ మఠ్’, ‘పర్దేశీ’, ‘మొఘల్ ఎ ఆజం’ ‘కల్ ఆజ్ ఔర్ కల్’ తదితర చిత్రాలు పృథ్వీరాజ్ కపూర్ కెరీర్‌లో ఆణిముత్యాలుగా నిలిచాయి. ఈయన చిత్ర సీమకు చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం నుంచి 1949లో రాష్ట్రపతి మెడల్, 1969లో పద్మభూషన్ పురస్కారం, 1972లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు. నేడు పృధ్విరాజ్ కపూర్ వర్ధంతి. ఈ సందర్భంగా ఆ మహానటుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.