Priyanka chopra : ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారతీయ సినీనటి ప్రియాంక చోప్రా జోనాస్, తన నిర్మాణ సంస్థ ‘పర్పుల్ పెబుల్ పిక్చర్స్’ ద్వారా ఎన్నో విభిన్నమైన చిత్రాలను నిర్మిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘వెంటిలేటర్’, ‘సర్వణ్’, ‘ది స్కై ఈజ్ పింక్’, ‘ది వైట్ టైగర్’ వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలను నిర్మించిన ప్రియాంక, తన తొలి మరాఠీ చిత్రం ‘పానీ’ని 2019 లో ప్రారంభించిన విషయం తెలిసిందే.
అయితే, అప్పటి నుంచి ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా, ఐదేళ్ల అనంతరం ఈ చిత్రం అక్టోబర్ 18, 2024న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. మా మరాఠీ చలన చిత్రం పానీ అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లలో కలుద్దాం’ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
‘పానీ’ చిత్రం మహారాష్ట్రలోని నీటి సమస్యను ప్రధాన అంశంగా చేసుకుని తెరకెక్కింది. నగర్ వాడీ అనే గ్రామంలో నీటి ఎద్దడి కారణంగా చాలామంది వివాహం చేసుకోలేకపోతున్న విషయాన్ని ఈ చిత్రం హృద్యంగా చిత్రిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక యువకుడి జీవితం ఎలా మారుతుందనేది కథాంశం.నితిన్ దీక్షిత్ రచించిన ‘పానీ’ కథను అద్దినాథ్ ఎం. కొఠారే దర్శకత్వం వహించారు.