Prathani Ramakrishna Gowd : నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అక్కర్లేని పేరు ప్రతాని రామకృష్ణగౌడ్. 1992లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన 36 సినిమాలను నిర్మించి, 7 చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిన్నప్పటి నుంచే నటనపై ఉన్న మక్కువతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు రామకృష్ణగౌడ్. కాలేజీలో నాటకాలలో పాల్గొనడం ద్వారా తన నటనా నైపుణ్యాలను మెరుగుపరచుకున్నారు. శనివారం (మే 18) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
కొన్నేళ్లుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష బాధ్యతలతో బిజీగా ఉన్న రామకృష్ణగౌడ్, ఇటీవల మళ్లీ దర్శకత్వం వైపు దృష్టి సారించారు. “దీక్ష” అనే సినిమాతో దర్శకుడిగా మూడోసారి పునరాగమనం చేస్తున్నారు. దర్శకుడు, నిర్మాత అనే రెండు పాత్రలలోనూ తనకు సమానమైన ఇష్టం ఉందని చెప్పారు రామకృష్ణగౌడ్. అయితే తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా పనిచేయడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తారని తెలిపారు. అలాగే ఇకపై వరుసగా చిత్రాలు చేస్తానని తెలిపారు.
తెలంగాణకు చెందిన కళాకారులు, నిర్మాతలు, దర్శకులను ప్రోత్సహించడానికి 2014లో తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ను స్థాపించారు రామకృష్ణగౌడ్. ప్రస్తుతం 16 వేలకు పైగా మంది కళాకారులు, టెక్నీషియన్లు ఈ సంస్థ సభ్యులుగా ఉన్నారు.