చిత్రం : ప‌వ‌ర్ ప్లే

నటీనటులు : రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌ తదితరులు.

సంగీతం : సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ : ఐ. ఆండ్రూ

ఎడిటింగ్‌ : ప‌్ర‌వీణ్ పూడి

బ్యానర్ : వనమాలి క్రియేషన్స్

నిర్మాత : మ‌హిధర్‌, దేవేశ్‌‌

క‌థ‌-మాట‌లు : న‌ంద్యాల ర‌వి

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : విజ‌య్ కుమార్ కొండా

విడుదల తేది : 05-03-2021

‘ఉయ్యాల జంపాల’ ‘కుమారి 21ఎఫ్’ చిత్రాలతో విజయాన్ని పొంది మంచి క్రేజ్ ను పొందిన హీరో రాజ్ తరుణ్. ఈ సినిమాల తర్వాత చేసిన సినిమాలేవి అంతగా ఆకట్టుకోలేదు. విజయం కోసం చాలా కాలం గా ఎదురుచూస్తున ఈ హీరో  డైరెక్టర్ విజయ్ కుమార్ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ మూవీ పవర్ ప్లే తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో  హేమల్, పూర్ణ, అజయ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఒరేయ్ బుజ్జిగావంటి వినోదాత్మ‌క సినిమా త‌ర్వాత ఈ ఇద్ద‌రి నుంచి వ‌స్తున్న కొత్త చిత్ర‌మిది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్లు, ట్రైల‌ర్లకు ఆద‌ర‌ణ ద‌క్క‌డంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆడియన్స్ ను ఏమేరకు థ్రిల్ చేసింది? రాజ్‌త‌రుణ్‌, విజ‌య్ కుమార్‌ల‌కు హిట్ సినిమాగా నిలిచిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం..

కథ : విజ‌య్ కుమార్ (రాజ్‌త‌రుణ్‌) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు.  స్వీటి (హేమ‌ల్‌)ని తను ఇద్ద్దరు ప్రేమలో ఉంటారు. ఇద్ద‌రూ పెద్ద‌ల అనుమతితో పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. తనకు ఉద్యోగం లేద‌న్న కార‌ణంతో స్వీటి నాన్న పెళ్లికి అంగీకరించడు. అప్పుడు విజ‌య్ తండ్రి త‌న ప్ర‌భుత్వ ఉద్యోగానికి వాలంట‌రీ రిటైర్మంట్ ప్ర‌క‌టించి తన ఉద్యోగం త‌న కొడుకుకు వ‌చ్చేలా చేస్తాడు. ఇక పెళ్లికి ఉన్నఅన్ని ఇబ్బందులు తొలిగాయని, అతని ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడానికి పబ్ కు వెళ్ళిన తనను దొంగనోట్లు నేరం కింద పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ రోజుతో తన జీవితం తలక్రిందులవుతుంది. చేయని తప్పుకు అరెస్ట్ అవ్వడం ప్రేమించిన అమ్మాయి దూరం కావడం. ఈ స‌మ‌స్య‌ల వ‌ల నుంచి అత‌నెలా బ‌య‌ట‌ప‌డ్డాడు? మొత్తంగా ఈ కేసు నుండి బయటపడి ప్రేమించిన అమ్మాయిని పొందాడా లేదా..? ఆ నకిలీ కరెన్సీ వెనుకాల ఉన్న్నది ఎవరు అనే ఆసక్తికరమైన అంశాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

కథ విశ్లేషణ : అధికారంలో ఉన్న వ్య‌క్తులు, రాజ‌కీయ నాయ‌కులు తాము చేసిన తప్పులు నేరాలను తమకున్న పలుకుబడితో  చ‌ట్టాల్ని, పోలీసులను పావుగా వాడుకుని దానికి సామాన్యులను ఇరికించి వారి జీవితాలను నాశనం చేస్తుంటారు. ఈ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది.  ఒక‌వేళ నేరం ఆపాదించబడిన సామాన్యుడు తిర‌గ‌బ‌డితే ఎలా ఉంటుందనేది..? ఈ చిత్రంలో థ్రిల్లింగ్‌ స్క్రీన్ ప్లే తో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్‌. ఎన్నుకున్న ఆలోచ‌న బాగున్నా కానీ.. ఆ ఆలోచనకు చుట్టూ జరిగే కథను ఆకట్టుకునేలా కథ, కథనాలను నడిపించడంలో ద‌ర్శ‌కుడు సక్సెస్ అవ్వలేదు అనిపిస్తుంది. సినిమా మొదట్లో వచ్చే కారు యాక్సిడెంట్ జ‌ర‌గ‌డం, దాని వ‌ల్ల డ్ర‌గ్స్ మాఫియాకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి రావ‌డం వంటి స‌న్నివేశాల‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా మొద‌లైన. త‌ర్వాత హీరో హీరోయిన్ ప్రేమ‌, ఇంట్లో వాళ్ల‌ని పెళ్లికి ఒప్పించేందుకు త‌ను చేసే ప్ర‌య‌త్నాలు అలా క‌థ‌లోకి వెళ్లగా… అదే సమయంలో విజ‌య్‌ అనుకోని విధంగా ఓ కేసులో జైలుకు వెళ్ల‌డం.. త‌ర్వాత అత‌ను బెయిల్‌పై బ‌య‌ట‌కు రావ‌డం.. తను నేరం చేయలేదని ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నించ‌డం.. మ‌రోవైపు విజ‌య్‌ని చంప‌డానికి ఓ వ్య‌క్తి ప్ర‌య‌త్నిస్తుండ‌టం.. వంటి స‌న్నివేశాల‌తో మొదటిభాగం కొనసాగుతుంది. అయితే థ్రిల్ల‌ర్ కథాంశంతో తెరకెక్కిన కానీ ఆస‌క్తి రేకెత్తించే మ‌లుపులు ఎక్క‌డా క‌నిపించ‌వు. దానితో ప్రేక్ష‌కుల‌కు ఓ మామూలు కమ‌ర్షియ‌ల్ సినిమా చూస్తున్నట్లు అసహనంకి లోనవుతారు. అనుభూతే క‌లుగుతుంది. దర్శకుడు చెప్పాలనుకున్న ట్విస్ట్లు థ్రిల్లింగ్ పాయింట్ సెకండ్ ఆఫ్ లో వచ్చే సన్నివేశాలతో మిగిలిన సినిమా నడుస్తుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ : లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ తన మునుపటి సినిమాలో అందరిని నవ్వించే పాత్రలు చేసాడు. ఇపుడు  మొదటి సారి థ్రిల్లర్ సినిమాకి తగట్టు సీరియస్ గా అవసరమైన సన్నివేశాల్లో కనిపించాడు. ఇందులో ముఖ్యమైన పాత్ర చేసిన పూర్ణ, తను చేసిన ఈ పాత్ర సినిమాకి ప్లస్ అయ్యింది. తను చేసిన ఆ పాత్ర తాలూకు సీన్స్ లో మంచి ఎక్స్ ప్రెషన్స్ ని కనబరిచింది. ఇక హీరోయిన్ హేమల్ ఉన్నంతలో బాగానే నటించింది. ఇక ముఖ్య పాత్రలు పోషించిన రాజా రవీంద్ర, కోట శ్రీనివాసరావు, రవి వర్మ, అజయ్, ధన్ రాజ్ లు వారి పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నిషియన్స్ పనితనం : ఆండ్రూ కెమెరా ప‌నిత‌నం ఈ సినిమాకి అత్యంత ప్ర‌ధాన‌మైన బ‌లం. కెమెరా ఎప్పుడూ ప‌రుగెడుతూనే ఉంటుంది. సురేష్ బొబ్బిలి నేప‌థ్య సంగీతం ఈ క‌థ‌ని, స‌న్నివేశాల్నీ ఇంకో స్థాయిలో కూర్చోబెట్టాయి. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ ప‌నిత‌నం వ‌ల్ల స‌న్నివేశాల్లో స్పీడు పెరిగింది. ఇది దర్శ‌కుడి సినిమా. ఓ కొత్త త‌ర‌హా క‌థ‌ని అందించాల‌న్న త‌న ప్ర‌య‌త్నం చేశాడు.

రేటింగ్ : 2.25/5

Leave a comment

error: Content is protected !!