తెరపై కదిలే బొమ్మల్ని తొలిసారిగా భారతీయులకు పరిచయం చేసిన మహనీయుడు ఆయన. భారతీయ కథల్ని సినిమాలుగా మలచి.. మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన మహానుభావుడాయన. ఫోటోగ్రఫీని వృత్తిగా చేపట్టి.. ఆ ప్రతిభతోనే భారతీయ చలనచిత్ర పితామహుడుగా అవతరించిన మహాత్ముడు ఆయన. పేరు దుండిరాజ్ గోవింద పాల్కే అనే దాదా సాహెబ్ పాల్కే.
ఫోటో గ్రాఫర్ అయిన దాదా సాహెబ్ 1910లో తొలిసారి ‘ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్’ అనే సినిమాను చూశారు. అప్పుడే ఆయనకు భారతీయ కథలను మన దేశంలోనే సినిమాలుగా ఎందుకు నిర్మించకూడదు అనే ఆలోచన కలిగింది. అంతే.. కొంత డబ్బును సేకరించి కొన్ని లఘు చిత్రాలను నిర్మించడం మొదలుపెట్టారు. అలా తన తొలి చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ నిర్మాణానికి 1913లో శ్రీకారం చుట్టారు. తర్వాత తన కంపెనీని నాసిక్‌కు మార్చారు. ఈ సినిమా ప్రీమియర్ ప్రదర్శన 1913 ఏప్రిల్ 21న బొంబాయి ఒలింపియా థియేటర్లో నిర్వహించారు. తర్వాత బొంబాయి కోరోనేషన్ సినిమా హాల్లో 1931 మే 3న ప్రజలకు ప్రథమ ప్రదర్శన ఇచ్చారు. ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఫాల్కే తీసిన తొలి సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ చిత్ర విజయంతో ఇక వరుసపెట్టి భక్తిరసాత్మక కథలన్నీ వెండితెరపై సందడి చేయడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఫాల్కే ‘సత్యవాన్ సావిత్రి’, ‘లంకాదహన్’, ‘శ్రీకృష్ణ జన్మ’, ‘కాళీయ మర్దన్’ వంటి మూకీ సినిమాల నిర్మాణాన్ని కొనసాగించారు. ఆ తర్వాత 1918లో ఫాల్కే ఫిలిమ్స్ సంస్థను మూసి వేసి ‘హిందుస్తాన్ సినిమా ఫిలిమ్స్’ అనే నూతన సంస్థను స్థాపించారు. స్టూడియో నిర్మించారు. అదే బ్యానర్ మీద 44 మూకీ సినిమాలు ఫాల్కే నిర్మించారు. భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో చలన చిత్రపు అత్యున్నత పురస్కారాన్ని నెలకొల్పింది. సినిమా రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందిస్తారు. తొలిసారి ఈ అవార్డును దేవికారాణికి ప్రదానం చేశారు. నేడు ఫాల్కే 151వ జయంతి . ఈ సందర్భంగా ఆ మహానుభావుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.