ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సాయికిరణ్ దైదా విలేఖర్లతో ముచ్చటించి చిత్ర విశేషాలను పంచుకున్నారు. పిండం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పిండాకారం అంటారు. అలాగే ఒక మనిషి చనిపోయాక పెట్టేది కూడా పిండం అనే అంటాం. అసలు అది ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కథలో కోర్ పాయింట్ అదే. నేను కథ రాసుకున్నప్పుడే పిండం టైటిల్ అనుకున్నాం. ఇలాంటి నెగటివ్ టైటిల్ ఎందుకు, అసలే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ అని నా టీమ్ మెంబర్స్ కూడా పిండం టైటిల్ మార్చమన్నారు. అయితే ఒక మూఢ నమ్మకాన్ని పట్టుకొని, కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ని కాదని వేరే టైటిల్ పెట్టడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది. సినిమా చూశాక అందరూ అంటారు.. ఇదే ఈ సినిమాకి కరెక్ట్ టైటిల్ అని. భవిష్యత్ లో కూడా నేను ఏ సినిమా చేసినా కథకి సరిపోయే టైటిలే పెడతాను. చిన్నప్పటి నుండి నాకు రాయడం అంటే ఇష్టం. కాలేజ్ సమయంలో బ్లాగ్స్ రాసేవాడిని. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ లు, అక్కడి నుంచి ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ లు రాయడం అలవాటు చేసుకున్నాను. యూఎస్ లో బిజినెస్ ఉన్నప్పటికీ స్క్రిప్ట్ లు రాయడం కొనసాగించాను. నాకు ఎప్పుడైతే పట్టు వచ్చింది అనిపించిందో అప్పుడు సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు. టీజర్ కి, ట్రైలర్ కి రెండింటికీ మంచి స్పందన వచ్చింది. కేవలం టీజర్ తోనే మా సినిమా బిజినెస్ అయిపోయింది. ట్రైలర్ చూసి ఎందరో అభినందించారు. మీరు టీజర్, ట్రైలర్ లో చూసిన దానికంటే ఎన్నో రెట్ల కంటెంట్ సినిమాలో ఉంటుంది. ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన హారర్ సినిమాలన్నీ ఒక ఎత్తు. మా పిండం సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏదో భయపెట్టాలని ఒక హారర్ సీన్ పెట్టడం అలా ఉండదు. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు. సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రలకు మనం ఎంతలా కనెక్ట్ అయితే, భయం అనేది అంత బాగా పండుతుంది. ఊరికే ఏదో హారర్ పెట్టాలి అన్నట్టుగా ఉండదు. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అప్పుడే భయం ఇంకా ఎక్కువ పండుతుంది. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ సినిమాలకి ట్రెండ్ కూడా బాగుంది. మాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాం.

Leave a comment

error: Content is protected !!