విలక్షణ నటుడు నటప్రపూర్ణ డా.మోహన్ బాబు సినీ కెరీర్ లో హైయస్ట్ గ్రాసర్ గా నిలిచిపోయిన చిత్రం ‘పెదరాయుడు’. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ లో దుమ్మురేపేసింది. 1995, జూన్ 15న విడుదలైన ఈ సినిమా .. నేటికి సరిగ్గా పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. అన్నదమ్ములుగా మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా లో అతిథి పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ అదరగొట్టారు. మోహన్ బాబు తండ్రిగా రజనీకాంత్ మరిచిపోలేని రీతిలో నటించి మెప్పించిన ఈ సినిమా తమిళ చిత్రం ‘నాట్టామై’ కి రీమేక్ వెర్షన్. శరత్ కుమార్, విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళనాట ఓ రేంజ్ లో హిట్టైంది. భానుప్రియ, సౌందర్య కథానాయికలుగా నటించగా.. విలన్ గా ఆనందరాజ్ నటించారు. ఇంకా చలపతిరావు, జయంతి, శుభశ్రీ, రాజా రవీంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కోటి సంగీత సారధ్యంలోని పాటలు ఇప్పటికీ ఎంతగానో అలరిస్తున్నాయి. ‘కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ’ , బావవి నువ్వు భామను నేను.. అబ్బ దాని సోకు.. కో అన్నదోయి.. ఢమ ఢమ గుండె ఢమరుకం మోగే.. లాంటి పాటలు పెదరాయుడు చిత్రానికి ప్రధాన ఆకర్షణలు .