నెత్తి మీద కుచ్చుటోపీ.. చేతిలో పుస్తకాల దొంతర.. జేబు నిండా రంగు రంగుల కలాలు. భుజం మీద శాలువ. పెదవుల మీద చిరునవ్వు. గొంతునిండా.. రాగాల మయమైన గీతాలు. ఆయన పేరు ప్రతివాద భయంకర శ్రీనివాస్ .  అందరూ పిబీ శ్రీనివాస్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన గొంతెత్తితే మెలోడీ పలుకుతుంది. పెన్నెత్తితే కవిత్వం ఉరకలెత్తుతుంది. ముళ్ళపూడివారు ఆయన్ను ముద్దుగా శ్రీనివాయిస్ అని పిలుచుకొనేది అందుకే.

కాకినాడకు సమీపంలోని గొల్లప్రోలు గ్రామంలో జన్మించారు పీబీ . జెమిని పతాకం మీద ఆర్‌.కె. నారాయణ్‌ నవల ఆధారంగా నిర్మించిన హిందీ చిత్రం ‘మిస్టర్‌ సంపత్‌’ (1952)లో శ్రీనివాస్‌ను నేపథ్యగాయకుడిగా వాసన్‌ పరిచయం చేశారు. ఆ చిత్రానికి ఈమని శంకరశాస్త్రి, కల్లా బాలకృష్ణ సంగీతం సమకూర్చగా పి.బి. శ్రీనివాస్‌ అందులో మూడు పాటలు పాడారు. ‘భలేరాముడు’ సినిమాలో పాడిన‘భయమేలా ఓ మనసా భగవంతుని లీల’ అనే పాటతో శ్రీనివాస్‌కు మంచి గుర్తింపు వచ్చింది. 1977లో బాపు నిర్మించిన ‘స్నేహం’, 1978లో నిర్మించిన ‘గోరంతదీపం’ సినిమాల్లో మహదేవన్‌ పీబీ చేతనే ఎక్కువ పాటలు పాడించారు. ఇవి కాకుండా ఆయన తెలుగులో పాడిన పాటలు కోకొల్లలు. తెలుగులో పీబీ ఎన్నో ప్రైవేట్‌ రికార్డుల కోసం పాటలు పాడారు. కన్నడ కంఠీరవ రాజకుమార్‌ తన సినిమాల్లో పాటల్ని తనే పాడుకునేవారు. జి.కె. వెంకటేష్‌కు పీబీ అంటే చాలా ఇష్టం. ఆయన ‘ఒహిలేశ్వర’ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నప్పుడు పి.బి. శ్రీనివాస్‌కు పాడే అవకాశం ఇద్దామని ప్రతిపాదిస్తే పెద్దమనసుతో రాజకుమార్‌ ‘సరే’ అన్నారు. అది మొదలుకొని రాజకుమార్‌ సినిమాలకు 1974 వరకు శ్రీనివాసే పాడారు. ఒకానొక సందర్భంలో రాజకుమార్‌ ‘నేను శరీరమైతే శ్రీనివాస్‌ నా శారీరం’ అని కీర్తించారు. ఆ మాట  శ్రీనివాస్‌ తనకు పద్మ పురస్కారంతో సమానమని చెప్పుకున్నారు. అలా పీబీ శ్రీనివాస్ దక్షిణాదిన మెలోడీ గాయకుడిగా ప్రసిద్ధి చెందారు. నేడు పీబీ శ్రీనివాస్ వర్ధంతి. ఈ సందర్భంగా ఆ మహా గాయకుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!