స్ర్కీన్ ప్లే రాయడంలో చెయితిరిగిన చెయ్యి ఆయనది. సన్నివేశాన్ని రక్తికట్టించడంలో అందెవేసిన చెయ్యి. డ్రామా నడిపించడం, సెంటిమెంట్ వర్కవుట్ చేయడంలోనూ సిద్ధహస్తుడు ఆయన. ఒకటా రెండా..  సోదరుడు గోపాలకృష్ణతో కలిసి దాదాపు 350 సినిమాలకు కథ, స్ర్కీన్ ప్లే కూర్చిన ప్రఖ్యాతి గాంచిన చెయ్యి అది. ఆయన పేరు పరుచూరి వెంకటేశ్వరరావు. నిన్నటి తరం సినిమాని కమర్షియల్ పట్టాలెక్కించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నఆయన… నాటక రచయిత, నటుడు, సంభాషణల రచయిత, దర్శకుడు… ఇలా అనేక రకాలుగా సినిమా సేవకు వెంకటేశ్వరరావు అంకితమయ్యారు. తాను  కథ, స్ర్కీన్ ప్లే కూర్చితే.. తమ్ముడు మాటల్ని తూటాలుగా పేల్చి థియేటర్స్ దద్దరిల్లేలా చేస్తాడు.

‘చలి చీమలు’ చిత్రంతో పరుచూరి బ్రదర్స్ సినీ ఎంట్రీ జరిగింది. 1979లో ‘కలియుగ మహాభారతం, ఛాయ, సీతే రాముడైతే’, 1980లో ‘బడాయి బసవయ్య, సమాధి కడతాం చందాలివ్వండి., మానవుడే మహనీయుడు’, 1981లో ‘భోగభాగ్యాలు, మరో కురుక్షేత్రం’ లాంటి సినిమాలకు రచనలు చేస్తూ వచ్చారు. 1982లో ఎన్టీఆర్, శ్రీదేవి, జయప్రద నటించిన ‘అనురాగ దేవత’ సినిమాకు సంభాషణలు సమకూర్చారు. ఆ తర్వాత ‘నాదేశం’ సినిమాకు కూడా రచన చేసారు. 1982లో ‘ఈనాడు’ సినిమాకి పనిచేసారు. 1983లో ముందడుగు సినిమాతో కమర్షియల్‌గా ఓ ‘ముందడుగు’ పడింది. డి. రామానాయుడు నిర్మాతగా, కె. బాపయ్య దర్శకతంలో కృష్ణ, శోభన్‌ బాబు, జయప్రద, శ్రీదేవి నటించిన ఈ చిత్రానికి పరచూరి బ్రదర్స్‌ కధ, మాటలు అందించారు. 1983లో ఈ సినిమా విడుదలయింది. ‘ఈ దేశంలో ఒకరోజు, చట్టానికి వెయ్యి కళ్ళు, చండశాసనుడు, సిరిపురం మొనగాడు, ప్రజారాజ్యం కాలయముడు’…ఇలా రాస్తూ పోతుండగా 1983లో చిరంజీవి ‘ఖైదీ’కి కథ, మాటలు అందించారు. అప్పటి ఖైదీతో పాటు ‘ఖైదీ నంబర్‌ 150’కి కూడా పరచూరి బ్రదర్స్‌ పనిచేసారు. ఇప్పటికీ ఇంకా తమలో రచనా శక్తి, ఆ ఆసక్తి ఉందని చాటిచెబుతున్నారు అన్నదమ్ములిద్దరూ. నేడు పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆ అగ్రజుడికి శుభకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

 

Leave a comment

error: Content is protected !!