ప్రముఖ నేపథ్యగాయకుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రలో .. రాధిక మరో కీలక పాత్రలో నటించిన మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఓ పాపా లాలీ’. 1990 లో విడుదలైన ఈ డబ్బింగ్ సినిమా సరిగ్గా 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. గీత, అంజు,జనకరాజ్, రమేష్ అరవింద్, నీనా , చిన్నిజయంత్ , వివేక్, శ్రీవిద్య, చార్లీ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు దర్శకుడు వసంత్. తమిళ సూపర్ హిట్టు చిత్రం ‘కేళడి కణ్మణి’ చిత్రానికి తెలుగు అనువాదం ఈ సినిమా.

భార్య ను ఒక ప్రమాదంలో పోగొట్టుకొన్న రంగరాజ్ .. తన కూతురు అనునే  ప్రాణంగా బతుకుతూంటాడు. అయితే అను కి ఒక విచిత్రమైన రోగం ఉంటుంది. దాంతో తాను ఎంతో కాలం బ్రతకనని భావించి.. తన తండ్రికి తోడు కోసం చూస్తుంటుంది. అంతలో రంగరాజ్ కు శారద అనే ఒక అమ్మాయి పరిచయం అవువుతుంది. అనుకి కూడా ఆమె అంటే ఎంతో ఇష్టం ఏర్పడుతుంది. తాను చనిపోయే ముందు .. తన తండ్రిని, శారదను ఒకటి చేయాలని తపిస్తుంది. మరి చివరికి అను చనిపోతుందా? తన తండ్రిని, శారదని ఒకటి చేస్తుందా అనేది చిత్ర కథ. రంగరాజ్ గా యస్పీ బాలసుబ్రహ్మణ్యం, శారద గా రాధిక, అను గా మలయాళ నటీమణి అంజు .. ఆమె బాయ్ ఫ్రెండ్ గా కన్నడ నటుడు రమేష్ అరవింద్ అద్భుతంగా నటించారు. ఇక ఈ అద్భుత కథాచిత్రానికి ఇళయరాజా సంగీతం .. బంగారానికి తావి అబ్బినట్టు గా చక్కగా కుదిరింది. ముఖ్యంగా ఇందులో మాటేరాని చిన్నదాని అనే పాటను యస్పీ బాలు .. గుక్కతిప్పుకోకుండా పాడి.. అప్పట్లో సంచలనం సృష్టించారు. ఇప్పటికీ ఈ పాటని  సంగీత ప్రియులు ఎంతో ఇష్టంగా వింటారు. మిగతా పాటలు కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి.

Leave a comment

error: Content is protected !!