Niveda Thomas : ఒకప్పుడు తెలుగు సినిమాల్లో రమ్యకృష్ణ, సౌందర్య లాంటి హీరోయిన్స్ మధ్యతరగతి గృహిణి పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచేవారు. వారి నటనతో ఆ పాత్రలకు ప్రాణం పోసేవారు. కానీ కాలక్రమేణా అలాంటి పాత్రలు తెరమీద కనిపించడం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరించిన “35” సినిమా ఒక మధ్యతరగతి గృహిణి కథను తెరపైకి తీసుకువచ్చింది. ఈ చిత్రంలో నివేదా థామస్ అచ్చ తెలుగు గృహిణిగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతోంది.

ఇప్పటివరకు చాలా సినిమాల్లో మోడ్రన్ లుక్‌లో కనిపించిన నివేదా, ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్రలో నటించింది. “సరస్వతి” అనే పేరుతో సాధారణ గృహిణి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేయబోతోంది. చక్కటి చీరకట్టుతో నిలువెత్తు తెలుగు అందంతో నివేదా థామస్ ఈ పాత్రలో ఒదిగిపోయింది.

ఈ చిత్రంలో పిల్లల చదువు, కుటుంబ బంధాలు, బాధ్యతలు వంటి అంశాలను చాలా సహజంగా చిత్రీకరించాడు దర్శకుడు నందకిషోర్. ఈ రోజు సాయంత్రం 4:35 గంటలకు “సరస్వతి నమస్తుభ్యం” పేరుతో ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేయబోతున్నారు.

నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలకు ప్రేక్షకులు ఎల్లప్పుడూ కనెక్ట్ అవుతారని మనకు తెలుసు. “35” సినిమా కూడా అలాంటి కథే కాబట్టి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. నివేదా థామస్ నటన ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చడంలో సందేహం లేదు.

Leave a comment

error: Content is protected !!