నాగార్జున తన కెరీర్ లో పలు చిత్రాల్లో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు. వాటిలో చాలా ప్రత్యేకమైన చిత్రం ‘నిన్నే ప్రేమిస్తా’. షిండే దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బీ.చౌదరి నిర్మించిన ఆ సినిమా.. 2001, సెప్టెంబర్ 14న విడుదలై ఘన విజయం సాధించింది. సౌందర్య కథానాయికగా, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా.. రాజేంద్రప్రసాద్, చక్రవర్తి, చంద్రమోహన్, బ్రహ్మానందం, ఆలీ, యం.యస్ నారాయణ , తనికెళ్ళ భరణి , నూతన్ ప్రసాద్, చలపతిరావు, శివాజీరాజా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రియుడు .. ఒక యాక్సిడెంట్ లో చనిపోతే.. అతడ్ని మరిచిపోలేని ఆ యువతి.. అతడి కళ్ళను అమర్చిన యువకుడిని కళ్ళల్లో తన ప్రియుడ్ని చూసుకుంటూ కాలం గడపడమే ఈ సినిమా కథ. యాక్టిడెంట్ లో చనిపోయి తన కళ్ళను వేరొకరికి దానం చేసిన యువకుడిగా నాగార్జున నటించగా సౌందర్యను ఆరాధించే యువకుడిగా శ్రీకాంత్ నటించాడు. చక్కటి కథాకథాంశాలతో .. మనసును తాకే సన్నివేశాలతో .. ఈ సినిమాను అద్భుతమైన రీతిలో తెరకెక్కించాడు దర్శకుడు షిండే. నిజానికి ఈ సినిమా 1999లో తమిళంలో విడుదలైన ‘నీ వరువాయ్ ఎన’ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ వెర్షన్. పార్తీబన్, అజిత్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను రాజ్ కుమారన్ తెరకెక్కించాడు. యస్.ఏ.రాజ్ కుమార్ సంగీత సారధ్యంలోని పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.