Niharika Konidela : నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై యువ దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నాడు నిర్మాత నిహారిక కొణిదెల మీడియాతో ముచ్చటించారు. నిహారిక మాట్లాడుతూ…
కమిటీ కుర్రోళ్ళు సినిమా నన్ను ఎంతగా ఆకట్టుకుందో చెప్పలేను. కథ విన్న క్షణం నుంచి ఈ సినిమాను నేను నిర్మించాలని నిశ్చయించుకున్నాను. అంకిత్ నాకు ఈ కథను వివరించిన తీరు, అనుదీప్ కంపోజ్ చేసిన మ్యూజిక్, దర్శకుడు యదు వంశీ నాకు కథను చెప్పిన విధానం… అన్నీ కలిసి నన్ను ఈ సినిమాకు అతుక్కుపోయేలా చేశాయి.
సిటీ లైఫ్‌కు అలవాటుపడిన నేను జాతర వాతావరణాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. కానీ, వంశీ నాకు జాతరను కళ్లకు కట్టినట్లు చూపించాడు. అంతటి నిజాయితీగా, అంతటి అద్భుతంగా ఒక కథను చెప్పగలడని నేను అనుకోలేదు. ఓటీటీ అయినా, థియేటర్ అయినా సినిమా మేకింగ్ ప్రాసెస్ ఒకటే. అందుకే ఈ కథను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నేను నిర్ణయించు కున్నాను. వారసత్వం ఉందని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారని అనుకోకూడదు. సినిమా అంటే ప్యాషన్, ఇష్టం ఉండాలి. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే ఎంతో కష్టపడాలి. అప్పుడే మనం మంచి ఫలితాలను అందుకోవచ్చు.