Shopping Cart 0 items - $0.00 0

కొత్త విలన్స్ వస్తున్నారు…. !

ప్రస్తుతం సౌత్ లో విలనిజం కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త కథలతో కదం తొక్కుతోన్న యువ దర్శకులు .. తమ సినిమాలకు వైవిధమైన  విలనిజాన్ని కూడా యాడ్ చేస్తున్నారు.  ముఖ్యంగా ఈ ఏడాది విడుదల అయిన చిత్రాల్లో పలువురు నటులు విలన్ గా కొత్త జెర్నీ స్టార్ట్  చేశారు.  రాబోయే మరికొన్ని చిత్రాల్లోనూ  మరి కొంతమంది నటులు విలన్స్ గా టర్న్ అవుతున్నారు. 

‘దర్బర్’ లో ఇద్దరు బాలీవుడ్ నటులు

సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార జంటగా.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘దర్బార్’.. ఈ సంక్రాంతికి విడుదలై.. పర్వాలేదనిపించుకుంది.  ఇందులో పవర్ ఫుల్ అండ్ యారోగెంట్ కాప్ గా అదరగొట్టిన రజనీకాంత్ తో నువ్వా నేనా అంటూ పోటీ పడి విలన్ గా మెరిసాడు బాలీవుడ్ హీరో సునీల్ షెట్టి. అలాగే అతడి కొడుకుగా మరో బాలీవుడ్ హీరో ప్రతీక్ బబ్బర్ కాసేపు కనిపించి..తన ప్రత్యేకత చాటుకున్నాడు.

‘అశ్వథ్థామ’ కోసం బెంగాల్ నుంచి విలన్

యంగ్ హీరో నాగ శౌర్య.. సొంత కథ, సొంత నిర్మాణంలో రూపొందించిన థ్రిల్లర్ మూవీ ‘అశ్వథ్థామ’. రమణ తేజ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో సైకో విలన్ గా మెరిశాడు బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా. దాదాపు 90కి పైగానే బెంగాలీ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఈ యువ ప్రతికథానాయకుడు .. నితిన్ భీష్మ లో కూడా తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. అతడు నటించిన రెండు చిత్రాలూ సూపర్ హిట్టవడంతో .. జిషు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ అయిపోయాడు.

‘కలర్ ఫోటో’ తో  రంగుపడుద్ది అంటోన్న సునీల్

టాలీవుడ్ లో ఒక దశలో స్టార్ కమెడియన్ గా ఊపిరి సలపని బిజీలో ఉండే సునీల్ .. ఆ తర్వాత హీరోగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. అయితే మనోడికి హీరోగా ఏమాత్రం కలిసి రాలేదు. అతడు హీరోగా రెండే రెండు చిత్రాలు మాత్రమే విజయం సాధించగా.. మిగిలిన చిత్రాలన్నీ అతడ్ని డైలమాలోకి నెట్టేశాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోగా నటించాలా? లేక కమెడియన్ గా కొనసాగాలా అనే మీమాంశలో ఉండగా.. అతడి దృష్టి ఇప్పుడు విలన్ పాత్రలపై పండింది. ఆల్రెడీ రవితేజ డిస్కోరాజా లో క్లైమాక్స్ లో విలన్ గా కనిపించి ప్రేక్షకులకు షాకిచ్చిన సునీల్ .. త్వరలో రాబోతున్న కలర్ ఫోటోలో మరోసారి విలన్ గా అదరగొట్టబోతున్నాడు.

‘పలాసా 1978’ లో  కుంచె రఘు విలనిజం

రక్షిత్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ మూవీ ‘పలసా 1978. యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలై.. ఆకట్టుకుంటోంది. గతంలో పలు చిత్రాల్లో చిన్న చిన్నపాత్రలు పోషించిన సంగీత దర్శకుడు కుంచె రఘు.. ఈ సినిమాతో తొలిసారిగా విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకి అతడి విలనిజం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

‘‘ఉప్పెన’ తో విలన్ గా టాలీవుడ్ ను మొంచెత్తనున్న విజయ్ సేతుపతి

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ హీరోగా ఎంట్రీ ఇస్తూ.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విలేజ్ లవ్ స్టోరీ ‘ఉప్పెన’. ఇందులో రాయనం అనే పాత్రతో విలన్ గా తన అభినయాన్ని సరికొత్త ఆవిష్కరించనున్నాడు విజయ్ సేతుపతి. అంతేకాదు.. తమిళంలో దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న మాస్టర్ లో కూడా విజయ్ సేతుపతినే విలన్ గా నటించనుండడం విశేషం.

ఇంకా మరికొన్ని సౌత్ చిత్రాల్లో పలువురు నటులు విలన్స్ గా కొత్త టర్న్ తీసుకోనుండడం హాట్ టాపిక్ అయింది. మరి వీరిలో ఎంత మంది విలక్షణ విలనిజంతో మెప్పిస్తారో చూడాలి.

 

 

 

 

 

 

 

Leave a comment

error: Content is protected !!