నేడే విడుదల… ఈ మాట ప్రతీ ఫ్రైడే వింటుంటాం. ఫ్రైడే అంటే.. సినిమా పరిభాషలో రిలీజ్ డే. ఇదే కథాంశంతో ఓ సినిమా రిలీజ్ అయితే.. ఖచ్చితంగా ఇది ఇంట్రస్టింగ్ లైన్. ఇలాంటి కథతోనే ‘నేడే విడుదల’ మూవీ ఈరోజు ( మార్చి 10) న రిలీజ్ అయ్యింది. ఐకా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. ఆసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా.. కొత్త దర్శకుడు రామ్‌రెడ్డి పన్నాల డెబ్యూ ఇచ్చిన నేడే విడుదల మూవీ టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ వీడియోస్ తో సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. అయితే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కు తగ్గట్టు పూర్తి స్థాయిలో ఈ సినిమా అలరించిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
మూవీస్ ను ప్రమోట్ చేసే ఓ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు సిద్దూ (అసిఫ్‌ఖాన్) . అతనికి హారిక (మౌర్యాని) పై లవ్ ఉంటుంది. సత్యానంద్ (డైరెక్టర్ కాశీ విశ్వనాథ్) ఓ భారీ బడ్జెట్ సినిమాను తీసి ప్రమోట్ చేసే బాధ్యతను సిద్దూకు అప్పగిస్తాడు. సిద్దూ ప్రమోషన్స్‌కు సినిమాకు హైప్ క్రియేట్ అయ్య భారీ రీచ్ ఏర్పడుతుంది. బంపర్ ఓపెనింగ్స్ కలెక్షన్స్ తెచ్చుకుంటుంది సినిమా. అయితే పైరసీ భూతం కారణంగా ఉన్నట్టుండి సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోతాయి. భారీ నష్టాలు రావడంతో సత్యానంద్ చనిపోతాడు. అసలు సినిమా డౌన్‌ఫాల్ కావడానికి పైరసీనే కారణమా.. ఇంకేదైనా కుట్ర ఉందా ? ఈ కుట్రను సిద్దూ ఛేదించాడా ? నిర్మాతది సహజమరణమా.. ? ఆత్మహత్యా ? హత్యా ? వీటన్నింటికీ సమాధానమే ఈ నేడే విడుదల కథాంశం.
కథ… కథనం విశ్లేషణ:
ఎలాంటి సినిమా అయినా ఎంటర్‌టైన్‌మెంట్‌కు మేసేజ్ టచ్ ఇస్తూ కరెక్ట్ టైమింగ్‌లో ప్రజెంట్ చేస్తే ఆడియెన్స్‌కు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ నేడే విడుదల ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. దీనికి కాస్త మెసేజ్ జోడించాడు దర్శకుడు. ఫస్ట్‌హాఫ్ అంతా సరదా సన్నివేశాలతో నింపారు..
సెకండాఫ్‌లో అసలు కథను నడిపే సన్నివేశాలతో సాగుతుంది. కథలోని చిక్కుముడులన్నింటినీ విప్పే క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇలా థ్రిల్ చేస్తూనే శాఖాహారం కాన్సెప్ట్‌తో వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఉపయోగపడే టాపిక్‌తో కామెడీ క్రియేట్ చేసిన దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. దీంతో పాటు సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగాలున్నాయో.. సరిగ్గా వాడకపోయినా.. నైతిక విలువలు మరిచినా ఎంతటి ప్రమాదానికి కారణమౌతుందో ఈ సినిమా చక్కగా చూపించింది. భారీ బడ్జెట్‌తో, ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో తీసిన సినిమా పైరసీకి గురై సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయితే.. ఎంతటి నష్టం వాటిల్లుతుందో.. ఎంతటి ప్రమాదానికి కారణమౌతుందో చక్కగా చూపించారు. ఇలాంటి సమస్యలకు ఓ చక్కని పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేసింది ‘నేడే విడుదల’ సినిమా.
నటీనటుల పర్‌ఫార్మెన్స్ :
ఆసిఫ్‌ఖాన్‌లో యూత్‌ని ఎంటర్‌టైన్ చేసే హీరో మెటీరియల్ ఉంది. తనకప్పగించిన బాధ్యతను నెరవేర్చే యువకునిగా సిద్దూ పాత్రలో ఆసిఫ్‌ఖాన్ ఒదిగిపోయాడు. ఆసిఫ్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ మౌర్యాని చూడగానే ఆకట్టుకునేలా ఉంది. కేవలం గ్లామర్‌తోనే కాకుండా ఎక్స్‌ప్రెషన్స్, యాక్టింగ్‌తోనూ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది మౌర్యాని. నిర్మాత పాత్రలో కనిపించిన దర్శకుడు కాశీ విశ్వనాథ్ పాత్ర నిడివి తక్కువే ఉంది. అయినా చక్కని నటనతో ఆకట్టుకున్నాడు. హీరో ఫ్రెండ్స్‌గా యాక్ట్ చేసినా నటులు కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. కామెడీలో మిమిక్రీ ఆర్టిస్ట్‌కు మంచి క్రెడిట్ దక్కుతుంది.
హీరో తండ్రిగా అప్పాజీ అంబరీషా , మిగతా పాత్రల్లో నటించిన మాధవి, టి.ఎన్.ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక వర్ధన్, రసజ్ఞ లు పాత్ర పరిధి మేరకు అలరించారు. ఈ చిత్రం ఆసిఫ్‌ఖాన్ కెరీర్‌కు మంచి పునాధిలాంటిదని చెప్పొచ్చు.
టెక్నిషియన్స్ పనితీరు :
రామ్‌రెడ్డి పన్నాలకు ఇది మొదటి సినిమా. అయినా అనుభవం ఉన్న దర్శకుడిలా డీల్ చేసాడు. పైరసీ భూతం ఎప్పటి నుంచో సినీ పరిశ్రమను వేధిస్తున్న సమస్య. ఇదే ఇతివృత్తంగా తీసుకుని చక్కని కథనంతో అద్భుతమైన సీన్స్ అల్లుకుని.. సమస్యకు ఓ చక్కని పరిష్కారం ఇచ్చే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అజయ్ అరసాడ ఇచ్చిన సంగీతం సినిమాకి ప్రాణంలా నిలిచింది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల ల్యాగ్ ను తీసేసి ఇంకాస్త క్రిస్పీగా ఈ సినిమా మరింత బావుండేది. సి హెచ్ మోహన్‌చారి సినిమాటోగ్రఫీ కి మంచి మార్కులు పడతాయి. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ ను అందంగానే కాకుండా కెమిస్ట్రీ మేజిక్‌ను విజువలైజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ప్రొడ్యూసర్స్ నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ టెక్నికల్ వేల్యూస్ సూపర్బ్. కాంప్రమైజ్ లేకుండా తీసిన తీరు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఎలాంటి సినిమాకైనా ఎక్కడో ఓ చోట లోపాలు కనిపిస్తాయి. ఇందులోనూ అవాయిడ్ చేయదగ్గ లోపాలున్నాయి. అవి పట్టించుకోకుండా ఉంటే సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.
బాటమ్ లైన్ : నేడే విడుదల – గో అండ్ వాచ్ ఇట్.