Nara Rohith : టాలీవుడ్ యువ కథానాయకుడు నారా రోహిత్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన వివాహ నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ నటి శిరీష లేళ్లతో ఆయన నిశ్చితార్థం జరగడంతో సినీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

నారా, నందమూరి కుటుంబాల సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు, కథానాయకుడు బాలకృష్ణ, ఏపీ మంత్రి నారా లోకేశ్, నారా బ్రాహ్మణితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

నారా రోహిత్‌, శిరీష ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇద్దరూ కలిసి ‘ప్రతినిధి 2’ సినిమాలో నటించారు. శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్‌ చేశారు.

‘‘కలిసి లెక్కలేనన్ని ఆనంద క్షణాల్ని, సాహసాల్ని, జ్ఞాపకాల్ని పంచుకున్నాం. ఇప్పుడు శిరీషతో కలిసి జీవితంలో ఓ గొప్ప ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. నారా రోహిత్, శిరీషల వివాహం ఈ ఏడాది డిసెంబర్‌లో ఘనంగా జరగనున్నట్లు సమాచారం.

Leave a comment

error: Content is protected !!