మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను ఒక మేలి మలుపు తిప్పిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా తుఫాన్ లో సైతం వసూళ్ళ సునానీ సృష్టించింది. ఈ సినిమా విడుదలై ఈ నెల 9తో 30 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా ఈ చిత్రం తెరపైకి రావడానికి.. విజయవంతంగా కార్యరూపం దాల్చడానికి తెరవెనుక జరిగిన మూడు ఆక్తికరమైన కథల్ని వైజయంతీ మూవీస్ సంస్థ ప్రేక్షకులతో పంచుకోవాలని నిర్ణయించుకుంది. హిడెన్ స్టోరీస్ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కథల్ని నేచురల్ స్టార్ నాని వాయిస్‌తో అందిస్తోంది. తొలి వాయిస్ వీడియోని రిలీజ్ చేసింది.
`బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయి కానీ జనరేషన్లు మారినా ఎవర్‌గ్రీన్‌గా వుండే బ్లాక్ బస్టర్‌ల లిస్టులో ఫస్ట్ వుండే సినిమా `జగదేకవీరుడు అతిలోకసుందరి`. సినిమా తీసే, సినిమా చూసే విధానాన్ని మార్చిన ఈ చిత్రం ఎలా పుట్టింది? .. అశ్వనీదత్‌గారికి ఏనాటి నుంచో ఎన్టీఆర్ `జగదేకవీరునికథ` లాంటి ఫాంటసీ సినిమాని చిరంజీవిగారిలో చేయాలని, అది కూడా తను ప్రేమగా బావా అని పిలుచుకునే రాఘవేంద్రరావు మాత్రమే తీయగలడని గట్టి నమ్మకం వుండేదట. `ఆఖరి పోరాటం` తరువాత చిరంజీవిగారితో సినిమా అనుకున్నారు దత్తుగారు. ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీనివాస చక్రవర్తిగారిని రాఘవేంద్రావుగారితో తిరుమల పంపించారు. సరిగ్గా ఇద్దరు తిరుమల కొండపై వుండగా అశ్వనీదత్తుగారి మనసు తెలిసిన శ్రీనివాస చక్రవర్తి `దేవ కన్య భూమి మీదకు వచ్చినప్పుడు ఉంగరం పోగొట్టుకుంటుంది. అది చిరంజీవిగారికి దొరుకుతుంది అని జస్ట్ ఊహ మాత్రమే చెప్పారట. అది రాఘవేంద్రరావు గారికి బాగా నచ్చింది. దత్తుగారి కలకి దగ్గరగా వుంది. ఆయనకీ నచ్చింది. మరి జగదేకవీరుడికి జోడీగా అతిలోకసుందరి ఎవరు? .. అందరి మదిలో మెదిలిన పేరు ఒక్కరే వైజయంతీ ఆస్థాన నాయిక.. వెండితెర దేవత శ్రీదేవి. క్రేజీ కాంబినేషన్ సెట్టయింది. దానికి తగ్గట్టు కథని తయారు చేయడానికి వైజయంతీ మూవీస్ ఆఫీస్‌లో రచయితల కుంభమేళా ప్రారంభమైంది.
యండమూరి వీరేంద్రనాథ్‌గారు, జంథ్యాల గారితో మొదలై సత్యమూర్తిగారు విజయేంద్ర ప్రసాద్‌గారు, తమిళ రచయిత క్రేజీ మోహన్..ఇలా ఇంత మంది రచయితల సైన్యం సిద్ధమైంది. అంతే కాదు చిరంజీవిగారు కూడా నెల రోజుల పాటు అక్కడికి వెళ్లి కథ చర్చల్లో పాల్గొని తన సలహాలు కూడా ఇచ్చేవారు. దేవ కన్యను అతిలోక సుందరిగా చూపిస్తున్నప్పుడు నేను కొంచెం మాసిన గడ్డంతో సామాన్య మానవుడి లుక్‌లో వుంటేనే బాగుంటుంది అందరూ కనెక్ట్ అవుతారని చిరంజీవి సలహా ఇచ్చారు. ఇంకో వైపు బాంబేలో తన కాస్ట్యూమ్స్ తనే స్వయంగా డిజైన్ చేయించుకొని శ్రీదేవి కుట్టించడం మొదలుపెట్టారు. ఇలా అందరు కలిసి సమిష్టి కృషితో ఈ అందమైన చందమామ కథని తెలుగు సినీ చరిత్రలో మరిచిపోలేని ఒక అద్భుత చిత్ర కావ్యంగా మలిచారు. చరిత్రను సృష్టించిన ఈ సినిమా ఇంత ఈజీగా అయిపోయింది అనుకుంటున్నారా? లేదు మానవా.. చాలా జరిగినయ్ స్టే ట్యూన్డ్.. అంటూ తొలి వాయిస్ వీడియోని ముగించాడు నాని.
వీడియో ను వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?v=cwU2u6JkEMc&feature=youtu.be