చిత్రం : వైల్డ్ డాగ్
నటీనటులు : నాగార్జున, అలీ రెజా, సయామీ ఖేర్, దియా మీర్జా, అతుల్ కుల్ కర్ణి, అవ్జిట్ దత్, కెల్లి డోర్జి, అనిష్ కురువిల్ల, మల్హోత్ర శివం తదితరులు
బ్యానర్ : మ్యాట్ని ఎంటర్టైన్మెంట్
సంగీతం : తమన్
ఎడిటింగ్‌ : శర్వణ్‌ కత్తికనేని
ఛాయా గ్రహణం : షానిల్ డియో
రచన, దర్శకత్వం : అహిషోర్ సోలమన్
నిర్మాత : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

విడుదల తేది : 02-04-2021

మన్మధుడు 2 సినిమాతో ఆశించని ఫలితాన్ని అందుకోని నాగార్జున ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హైదరాబాద్ బాంబు పేలుళ్ల నేపధ్యంలో రూపొందిన ఈ సినిమాకి సంభందించిన ప్రమోషన్స్ లో కూడా ఎక్కువుగా పాల్గొన్నారు చిత్ర యూనిట్. ఈ మూవీ ప్రేక్షకులకు ఎటువంటి అనుభూతిని కలిగించిందనేది రివ్యూలో చూద్దాం…

కథ :

కొన్ని కారణాల వల్ల ఎన్ఐఏ సీనియర్ ఆఫీసర్ విజయ్ వర్మ (నాగార్జున) సస్పెండ్‌ చేయబడతాడు. పూణెలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసు అంతు చిక్కకుండా ఉంటుంది. దానిని చేధించే దిశగా విజయ్ వర్మకు మిషన్ అప్పగించేలా అధికారులు నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ఎన్ఐఏ అధికారులకు విజయ్ వర్మ పెట్టిన కండీషన్‌ కు ఒప్పుకుంటారు. అలా కేసును టేకప్ చేసిన విజయ్ వర్మను కొన్ని కారణాల వల్ల మళ్లీ సస్పెండ్ కి గురవుతాడు. అలా రెండోసారి కూడా విజయ్ వర్మను ఎందుకు సస్పెండ్ చేశారు..? పూణె కేసును శోధించే క్రమంలో విజయ్ వర్మ బయటపెట్టిన నిజాలు ఏంటి? మళ్లీ సస్పెండ్ అయిన విజయ్ వర్మ తాను టేకప్ చేసిన కేసును చేధించాడా..? లేదా..? అసలు పూణె బాంబ్ బ్లాస్ట్ వెనుకున్న వ్యక్తులు ఎవరు? విజయ్ వర్మ చివరకు వాళ్ళని ఏం చేశాడు? వంటి ఆసక్తికరమైన అంశాలకు సమాధానమే ఈ ‘వైల్డ్ డాగ్’ సినిమా.

కథ విశ్లేషణ : సినిమా యూనిట్ ముందుగా చెప్పినట్లే సినిమా అంతా కూడా ఓ ఫ్లేవర్ తో కూడిన యాక్షన్ డ్రామా మూడ్‌లోకి ఆడియన్స్ ను తీసుకు వెళ్తుంది. విజయ్ వర్మ కూతురు గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో చనిపోవడం, ప్రియా వర్మ (దియా మీర్జా)తో ఎమోషనల్ సన్నివేశాలతో కథ అలా ముందుకు సాగుతుంది. ఆ విధంగా దర్శకుడు మొదటి భాగంలో ఎక్కువగా ఎమోషనల్ సన్నివేశాలకు చోటు ఇచ్చినట్టు అనిపిస్తుంది. అలా సాగుతున్న క్రమంలో ఇంటర్వెల్ కి ముందు అసలు కథ మొదలయ్యేలా ద్వితీయార్థంపై ఆడియన్స్ కి ఆసక్తిని కల్పించారు దర్శకుడు. అలా మొదలైన ద్వితీయార్థంలో పూణె బాంబ్ బ్లాస్ట్ కు కారణమైన ఖలీద్‌ను పట్టుకునేందుకు నేపాల్ వెళ్లడం, అక్కడ వైల్డ్ డాగ్ టీం చేసే విన్యాసాలు, ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో టీంకు ఎదురైన ఘటనలతో ఆసక్తికరంగా మారుతుంది. అయితే కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ కు మాత్రం రొటీన్ అనే ఫీలింగ్‌ను కలిగిస్తాయి. ఎక్కడ కూడా ప్రేక్షకుడు థ్రిల్లింగ్ అయ్యే ఎలిమెంట్స్ ఏమి లేకపోవడం… ఇక క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్స్ కూడా సగటు ప్రేక్షకుడు ఊహించేలా ఉంటాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :
ఇది వరకే గగనం వంటి సినిమాలో చేసిన అనుభవంతో విజయ్ వర్మ పాత్రలో నాగార్జున ఆకట్టుకున్నాడు. ఎన్ఐఏ సీనియర్ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున దేశభక్తి గల అధికారికి తగ్గ గంభీరాన్ని, కోపాన్ని, యాటిట్యూడ్‌ను అన్నింటిని సమపాలలో పండిచాడు. ఇక మిగిలిన పాత్రలో దియా మీర్జా, అలీ రెజా, సయామీ ఖేర్, అవినాష్ కురువిల్లా, మయాంక్, ప్రకాష్, ప్రదీప్ ఇలా అందరూ కూడా తమ పరిధి మేరకు నటించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో వైల్డ్ డాగ్ టీంలోని ప్రతీ ఒక్కరూ చాల బాగా చేసారు.

దర్శకుడి పనితనం :

వైల్డ్ డాగ్ అనే సీరియస్ కథను మెప్పించేలా తీయడం అంత మామూలు విషయం కాదు. ఈ కథను అందరికీ చేరేలా తెరపై చూపడం కూడా చాలా కష్టమైన పని. పాటలు, కామెడి వంటి కమర్షియల్ హంగులు ఏమి లేకుండా కథను సీరియస్ గా చెప్పాలంటే డైరెక్టర్ కి అనుభవం కావాలనిపిస్తుంది. కానీ సోలోమన్ వైల్డ్ డాగ్‌ ను తెరపై అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపడంలో ఓ మేరకు సక్సెస్ అయ్యారు . సినిమా అంతా కూడా ఇన్వెస్టిగేషన్ అనే ఒక పాయింట్ చుట్టూనే తిరగడంతో మిగతా అంశాలన్నీ సైడ్ అయిపోయాయ్.

సాంకేతిక విభాగం :
వైల్డ్ డాగ్ వంటి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, కెమెరా వర్క్, బ్యాంగ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యమైన అంశాలుగా చెప్పొచ్చు. దానికి తగట్లుగా తెరపై మలిచిన తీరు, లోకేషన్స్ చూపించిన విధానం, యాక్షన్ ఎపిసోడ్స్ లో కెమెరా వర్క్ & బ్యాగ్రౌండ్ స్కోర్ లతో కెమెరామెన్ షానిల్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆకట్టుకున్నారు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలకు ఎడిటింగ్ కి పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లున్నాయి.

చివరిగా :  ‘వైల్డ్ డాగ్’ మిషన్  ఓ మేరకు   సక్సెస్ అయ్యింది

రేటింగ్ : 3/5

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

‘సుల్తాన్‌ ‘ రివ్యూ

Leave a comment

error: Content is protected !!