అమాయకమైన ముఖం.. తడిగుడ్డతో గొంతుకోసే నైజం.. చమత్కారమైన వాచకం… నవ్వు తెప్పించే లాంగ్వేజ్ .. విచిత్రమైన బాడీ లాంగ్వేజ్… కన్నింగ్ విలనీ.. వెరసి నాగభూషణం. భయంకరమైన రూపం ఏమీ లేకుండానే.. భయపెట్టే విలనిజానికి ఆయన పెట్టింది పేరు. జిత్తుల మారి ఎత్తులు వేయడంలోనూ.. తిమ్మిని బమ్మిని చేయడంలోనూ చెయితిరిగిన చెయ్యి ఆ విలన్ ది. తెలుగు తెరపై లెక్కకు మించిన చిత్రాల్లో విలన్ గానూ, కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ.. చాలా తక్కువ చిత్రాల్లో మాత్రమే హీరోగానూ నటించిన నాగభూషణం .. అభినయానికే ఒక భూషణం. పైకి మెత్తగా, సాధువులా కనిపిస్తూనే అనేకానేక అరాచకాలను చేసే పాత్రల్లో ఎంచక్కా ఒదిగిపోయి విలనిజానికి సరికొత్త భాష్యం చెప్పిన నటుల్లో నాగభూషణం ఒకరు. రక్త కన్నీరు నాగభూషణంగా రంగస్థల ప్రేక్షకులకు సుపరిచితమైన ఈయన వెండితెరపై కూడా తన వైభవాన్ని చాటుకున్నారు. సుమారు 395 సినిమాల్లో నటించి శాశ్వత కీర్తిని పొందిన నాగభూషణం ఒంగోలు తాలూకా అనకర్లపూడి అనే గ్రామంలో జన్మించారు.
మద్రాస్‌లో ఉద్యోగం. అక్కడ ఆంధ్ర కళామండలి అనే సంస్థ స్థాపించారు. అనేక నాటకాలు వేశారు. నాగభూషణం నటనకు నిలువెత్తు నిదర్శనం రక్త కన్నీరు. కొన్ని దశాబ్దాలపాటు రంగస్థలంపై అనేక సంచలనాలు సృష్టిస్తూ ఈ నాటకం అజరామరంగా నిలచింది. ఒకేసారి ఒకే నెలల్లో 30 ప్రదర్శనలు కూడా ఇచ్చిన నాటకంగా చరిత్ర సృష్టించింది. నాగభూషణం 1952లో ‘పల్లెటూరు’ చిత్రం ద్వారా తెలుగు సినిమా ప్రవేశం చేశారు. ఈ సినిమాని తాతినేని ప్రకాశరావు డైరెక్ట్ చేసారు. ఆ తరువాత మూడు దశాబ్దాలపాటు 395 చిత్రాల్లో వివిధ పాత్రలు వేశారు. కమెడియన్‌గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్‌గా ఇలా అనేక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. ‘రేచుక్క’, ‘ఏది నిజం?’, ‘భాగ్య రేఖ’, ‘మాయాబజార్’, ‘భూకైలాస్’, ‘చెంచులక్ష్మి’, ‘భట్టి విక్రమార్క’, ‘భీష్మ’, ‘మంచిమనుషులు’, ‘మూగమనసులు’, ‘జమీందార్’, ‘ఆమె ఎవరు?’, ‘బందిపోటు’, ‘బంగారు గాజులు’, ‘రణభేరి’, ‘వరకట్నం’, ‘ఆదర్శ కుటుంబం’, ‘ఆత్మీయులు’, ‘భలే రంగడులాంటి’ ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు వేసి మెప్పించారు. ‘బుద్దిమంతుడు’, ‘నాటకాల రాయుడు’, ‘బాలరాజు కధ’, ‘ధర్మదాత’, ‘జైజవాన్, ‘చెల్లెలు కాపురం’, ‘దసరాబుల్లోడు’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘పట్టుకుంటే లక్ష’, ‘మహమ్మద్ బీన్ తుగ్లక్’, ‘అందాల రాముడు’, ‘అందరూ దొంగలే’, ‘భలే దొంగలు’, ‘అడవిరాముడు’, ‘కురుక్షేత్రం’, ‘గోపాలరావుగారి అమ్మాయి’, ‘జాతర’, ‘ గడసరి అత్త…సొగసరి కోడలు’, ‘నేటి భారతం’, ‘నంబర్ వన్’ చిత్రాల్లో నటించారు. నేడు నాగభూషణం వర్ధంతి. ఈ సందర్భంగా ఆ అభినయ భూషణానికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.