చిత్రం: నాంది

నటీనటులు: అల్లరి నరేశ్‌, న‌వమి, వరలక్ష్మి శరత్‌కుమార్‌, ప్రియదర్శి, హరీశ్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, విన‌య్ వ‌ర్మ తదితరులు

సంగీతం: శ్రీచరణ్‌ పాకాల

ఎడిటింగ్‌: చోటా కె ప్రసాద్‌

సినిమాటోగ్రఫీ: సిధ్‌

క‌ళ‌: బ‌ర్ హ్మ క‌డ‌లి;

సంస్థ‌: ఎస్వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

నిర్మాత: సతీశ్‌ వేగేశ్న

దర్శకత్వం: విజయ్‌ కనకమేడల

విడుదల: 19-02-2021

అల్ల‌రి న‌రేశ్‌ అన‌గానే అందరికి ఎక్కువుగా తను చేసిన కామెడి సినిమాలే గుర్తుకు వ‌స్తాయి. కానీ అప్పుడ‌ప్పుడు తనలోని నటనని గుర్తించుకునేలా సీరియ‌స్‌ గా సాగే రోల్స్ ను నేను, ప్రాణం, ‘గ‌మ్యం’, ‘శంభో శివ శంభో’ ‘మహర్షి’ వంటి సినిమాల‌తో న‌టుడిగాను నిరూపించుకున్నాడు. ఐతే ఆ తర్వాత మూస ధోరణిలో చేసిన కామెడి సినిమాలు అంతగా అలరించలేదు. ఇప్పుడు మ‌రోసారి ఇంకో సీరియస్ క‌థ‌ని ఎంచుకుని ‘నాంది’ సినిమాతో వస్తున్నాడు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది..? స‌రైన విజ‌యాల్లేని అల్ల‌రి న‌రేశ్‌కి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ ఫలితాన్ని ఇచ్చింది..? ఈ సినిమ్తో దేనికి “నాంది ” పలికాడు..?

క‌థ:

మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన సూర్య‌ప్ర‌కాష్ (అల్ల‌రి న‌రేశ్‌) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటూ, అమ్మానాన్న‌, తను అంటే ఇష్టపడే స్నేహితుడితో క‌ల‌సి హాయిగా జీవితం సాగిస్తుంటాడు. మీనాక్షి (న‌వమి) అనే అమ్మాయితో పెళ్లి కూడా నిశ్చ‌య‌మ‌వుతుంది. ఇంత‌లో న్యాయ‌వాది, మాన‌వ హ‌క్కుల కోసం పోరాడే సామాజిక ఉద్య‌మ‌కారుడు రాజ‌గోపాల్ (సి.వి.ఎల్‌.న‌ర‌సింహారావు)ని హ‌త్య చేశాడ‌నే ఆరోప‌ణ‌తో సూర్య‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ హ‌త్య కేసులో ఐదేళ్లు జైల్లోనే మ‌గ్గుతాడు. ఇంత‌కి ఆ హ‌త్య‌ను సూర్య‌ప్ర‌కాష్ చేశాడా? ఐదేళ్ల త‌ర్వాత అత‌ని జీవితంలో ఏం జ‌రిగింది? జూనియ‌ర్ లాయ‌ర్ ఆద్య (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌) సూర్య‌ప్ర‌కాష్ జీవితాన్ని ఎలా ప్‌అభావితం చేసింది? అనే ఇతరత్ర ఆసక్తి గల విష‌యాలు తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాలి.

కథ విశ్లేషణ:

అక్ర‌మ నేరారోప‌ణ‌తో జైల్లో మ‌గ్గుతున్న ఓ యువ‌కుడి పోరాట‌మే ఈ చిత్రం. భార‌తీయ శిక్షా స్మృతిలోని సెక్ష‌న్ 211 ఎంత శ‌క్తిమంత‌మైన‌దో ఈ సినిమాలో ఆ ఆలోచ‌నను రేకెత్తించేలా చెప్పారు. ఒక అమాయ‌కుడి జైలు జీవితం, అతను న్యాయం కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. మొదటిభాగంలో సూర్య‌ప్ర‌కాష్ జీవితం, ఊహించ‌ని రీతిలో జైలు గోడ‌ల మ‌ధ్య‌కి చేర‌డంతోకొనసాగుతుంది. రెండవభాగంలో కోర్ట్ రూమ్ డ్రామాతో వచ్చే ఇంట్రెస్టింగ్ సీన్స్ తో సినిమా కొనసాగుతుంది. అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీగా క‌థానాయ‌కుడిని జైలుకి తీసుకెళ్ల‌డంతోనే సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు, జైల్లో అతని జీవితం గురించి వివ‌రించ‌డంతో అసలు కథ ప్రారంభమవుతుంది. ఉద్యోగం సంపాదించిన ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు త‌న భ‌విష్య‌త్తు కోసం త‌ల్లిదండ్రులు త్యాగం చేసిన చిన్న చిన్న ఆనందాల్ని గుర్తు పెట్టుకుని వాటిని తీర్చే స‌న్నివేశాలు మ‌న‌సుల్ని హ‌త్తుకుంటాయి. భావోద్వేగాల‌పై అక్క‌డ్నుంచే పట్టు ప్ర‌ద‌ర్శించాడు ద‌ర్శ‌కుడు. అంతా హాయిగా, సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబం ఒక్క‌సారిగా ఇబ్బందుల్లో ప‌డ‌టం, చేతికందివ‌చ్చిన కొడుకు అన్యాయంగా జైలుపాలు కావ‌డంతో ఆ కుటుంబం ప‌డే బాధ‌ని చ‌క్క‌గా తెర‌పైకి తీసుకొచ్చారు. విరామానికి ముందు వ‌చ్చే మ‌లుపు ఈ క‌థ‌ని మ‌రింత ఉత్కంఠ‌ భ‌రితంగా మారుస్తుంది. రెండవభాగంలో వచ్చే కోర్టు రూమ్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. సినిమాకి కావాల్సినంత డ్రామా అనేది బాగా పండింది. బ‌ల‌మైన భావోద్వేగాలు.. ఆస‌క్తిని రేకెత్తించే క‌థ‌నంతో సినిమా ఆద్యంతం క‌ట్టిప‌డేస్తుంది. ఎంచుకున్న అంశం సాధార‌ణ‌మైన‌దే. కానీ, దాన్ని ఆక‌ట్టుకునే క‌థ‌నంతో చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌న ప్ర‌తిభ‌ని ప్ర‌ద‌ర్శించాడు. ఇలాంటి అంశాల్ని ఎంచుకున్నప్పుడు ఎంతో ప‌రిశోధ‌న కావాలి. ద‌ర్శ‌కుడు ఆ ప‌రిశోధ‌న కావాల్సినంత చేశాడనిపిస్తుంది. అల్ల‌రి న‌రేశ్‌ కెరీర్‌కి ఈ సినిమా ఒక చక్కటి కీల‌కమైన మ‌లుపు. ఇక‌పై ఆయ‌న కొత్తగా ప్రయోగాలు చేయడానికి ఈ సినిమా అనేది ఓ నాంది అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. న‌టుడిగా న‌రేశ్‌ని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన ఈ చిత్రంలో, ఆయ‌న మేకోవ‌ర్ మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ. ఇలాంటి మరిన్నిక‌థ‌లు వస్తే తెలుగు సినిమాల్లో మార్పునకు ఈ చిత్రం నాంది ప‌లుకుతుంది అని చెప్పవచ్చు.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

సూర్యప్రకాష్ పాత్ర‌లో నరేశ్ చక్కగా ఒదిగిపోయాడు. తన గ‌త చిత్రాల ప్ర‌భావం, కామెడి ఇమేజ్ అనేది ఈ పాత్ర‌పై ఏ మాత్రం కూడా ప్ర‌భావం చూపించ‌కుండా పాత్ర‌లోఎంత ఒదిగిపోయాడో తెరపై చూసినప్పుడు ప్రేక్షకులు అందరు ఫీల్ అవుతారు. అసలు తొలి సీన్‌లోనే పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా పోలీస్‌ల ముందు చేతులు కట్టుకుని కింద కూర్చున్న అల్లరి నరేష్ సినిమా అంతా సాహ‌సోపేతంగా క‌నిపించాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో మిడిల్ క్లాస్ కుర్రాడిగా ఆక‌ట్టుకున్నాడు. జైల్లో మ‌గ్గుతున్న‌ప్పుడు ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన హావ‌భావాలు, ఆ క్ర‌మంలో పండే భావోద్వేగాలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ఈ సినిమాకి మ‌రో ప్ర‌ధాన బ‌లం. జూనియ‌ర్ లాయ‌ర్ ఆద్య పాత్ర‌లో ఆమె ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని గెల్చుకుంది అని చెప్పాలి. ఆమె ప‌రిచ‌యం, విరామానికి ముందు వ‌చ్చేనరేష్ స‌న్నివేశాల్లో ఆమె న‌ట‌న సినిమాకి కీల‌కం. తానే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పడం ఓ విశేషం మరి లెంతి డైలాగ్స్ వద్ద కొంచం తడబడిన చేసిన ప్రయత్నం అందరిని ఆకట్టుకుంటుంది. రెండవభాగం కోర్టులో ఆమె న‌ట‌న అద్భుతంగా ఉంది. ప్రియ‌ద‌ర్శి, ప్ర‌వీణ్ అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తూ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. హ‌రీశ్‌ ఉత్త‌మ‌న్‌, విన‌య్ వ‌ర్మ ప్ర‌తినాయ‌కులుగా క‌నిపిస్తారు. దేవిప్ర‌సాద్‌, శ్రీకాంత్ అయ్యంగార్, క‌థానాయిక న‌వమి త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

టెక్నీషియన్స్ పనితనం:

శ్రీచరణ్‌ పాకాల తన రీరికార్డింగ్‌తో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. సిధ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ చోటా కే ప్రసాద్ పనితీరు చాలా బాగుంది. ఎక్కడా సాగతీత లేకుండా సినిమాను చకచకా నడించాడు. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ఓ మంచి సందేశాత్మక చిత్రం లభించిందని చెప్పొచ్చు. చివరగా: నాంది చిత్రం ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 211 ఆధారంగా నడిచే కథ. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. సరియైన ఆలోచనతో న్యాయం రాబట్టుకోవడం మంచి పాయింట్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. విజయ్ కనకమేడల, సతీష్ ప్రయత్నాన్ని నిజంగా అభినందించాల్సిన విషయం. అలాగే రాజకీయాల్లోని అవినీతి, అక్రమాలపై సంధించిన అస్త్రంగా నాంది చిత్రం నిలుస్తుంది.

రేటింగ్-3/5

Leave a comment

error: Content is protected !!