Naa Uchvasam kavanam :  ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా శృతిలయ ఫౌండేషన్ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి రామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సిరివెన్నెల పాటల అందాలను ఆవిష్కరించే ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రసారం కానుంది.

తాజాగా, హైదరాబాద్ లో ఈ కార్యక్రమం యొక్క కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ హాజరై టీజర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయకుడు పార్థసారధి, దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడిన ముఖ్యాంశాలు:

పార్థసారధి: సీతారామశాస్త్రి గారి లాంటి గొప్ప గేయ రచయిత తెలుగు సినిమాకు దిక్కు. ఆయన పాటలను పాడటం నా అదృష్టం. ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు నాకు చాలా భయం ఉండేది. కానీ శ్రీరామ్ నాకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది శాస్త్రి గారి అభిమానులు, ప్రముఖులు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సిరి డెవలపర్స్ మూర్తిగారు, సిలికానాంధ్ర, డాక్టర్ గురువారెడ్డి గారి సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. శాస్త్రి గారి పాటలను, మాటలను చిరకాలం నిలిపి ఉంచాలనేది మా ప్రయత్నం.

కృష్ణవంశీ: నాకు సీతారామశాస్త్రి గారితో చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. ఆయనతో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తాను. నేను ఏ సినిమా మొదలుపెట్టినా ముందుగా ఆయనతో పాటల గురించి చర్చించేవాడిని. ప్రస్తుతం నేను కొత్త సినిమాను ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాను. కానీ పాటల విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. శాస్త్రి గారు లేకపోవడం వల్ల నాకు చాలా బాధగా ఉంది. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీరామ్, పార్థసారధి కి నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ద్వారా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యాన్ని, సంగీతాన్ని మరింత మందికి పరిచయం చేయాలని నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమం లో సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామ్ శాస్త్రి, డాక్టర్ గురువారెడ్డి, జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

error: Content is protected !!