ఆయన చేతిలో పడితే.. మాట పాటవుతుంది. ఆయన బాణీలకు పాట కూడా మాట్లాడుతుంది. సాధారణ జనం నాలుకపై నర్తించే పాటల్ని కూర్చడం ఆయనకు పరిపాటి. తండ్రి సంగీత సంపదను వారసత్వంగా పుచ్చుకొని టాలీవుడ్ లో ఒక దశలో పాటల తోటలో విహరించిన స్వర వనమాలి ఆయన. పేరు శ్రీ. పూర్తి పేరు శ్రీనివాస చక్రవర్తి. టాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడిగా తన సంగీత ప్రస్థానం సాగించిన ఆయన నేపధ్యగాయకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా తెలుగు చలన చిత్ర సీమలో ఒక వెలుగు వెలిగారు. భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ, హాయ్ రే హాయ్ జాంపండురోయ్, వారేవా ఏమి ఫేసు , నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని లాంటి ఎన్నో సుస్వరాల్ని అందించారు ఆయన.

ఇండిస్టియ్రల్‌ ప్రొడక్షన్‌లో ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన శ్రీ తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. సంగీతంపై మక్కువతో సినిమా రంగంపై దృష్టిపెట్టారు. ఓ టెలివిజన్‌ ఛానల్‌లో ప్రసారమై ప్రాచుర్యం పొందిన అంత్యాక్షరి సంగీత కార్యక్రమానికి యాంకర్ సుమతో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ షోతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ‘పోలీస్‌ బ్రదర్స్‌’ ఆయనకి తొలి చిత్రం. కథానాయకుడిగా అవకాశాలు వచ్చినా కాదనుకొని సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించారు. ‘సింధూరం’ సినిమా జరుగుతున్న సమయంలో దర్శకుడు రవిరాజా పినిశెట్టి ‘రుక్మిణి’లో కథానాయకుడిగా అవకాశం ఇచ్చినా ఆయన నో చెప్పడంతో వినీత్‌ని ఎంపిక చేసుకొని సినిమా చేశారు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘గాయం’ శ్రీ కెరీర్‌కి మలుపునిచ్చింది. అందులో సిరివెన్నెల రాసిన ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని…’ పాటతో ఆ చిత్ర దర్శకుడైన శ్రీకి కూడా మంచి పేరొచ్చింది. ఆ తరువాత వర్మ దర్శకత్వంలో  ‘మనీ మనీ’, ‘అనగనగా ఒక రోజు’, ‘సింధూరం’, ‘లిటిల్‌ సోల్జర్స్‌’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘అమ్మోరు’, ‘నా హృదయంలో నిదురించే చెలి’, ‘కాశీ’, ‘సాహసం’, ‘ఆడు మగాడ్రా బుజ్జీ’, ‘చంటిగాడు’, ‘నీకే మనసిచ్చాను’ తదితర సినిమాలకి శ్రీ సంగీతం అందించాడు.  ‘అనగనగా ఒక రోజు’ చిత్రంలో మా ఫ్రెండు చెల్లెల్ని కొందరు ఏడిపించారు… పాట శ్రీ శైలిని చాటి చెబుతుంది. మామూలు మాటల్ని సైతం ఒక పాటగా మలచొచ్చని శ్రీ తన బాణీలతో చాటి చెప్పారు. ‘లిటిల్‌ సోల్జర్స్‌’ సినిమాలో రమేష్‌ అరవింద్‌కీ, ‘ఆనంద్‌’ సినిమాలో ఆకాశ్‌కీ, ‘143’ చిత్రంలో సాయిరాం శంకర్‌కి డబ్బింగ్‌ చెప్పారు శ్రీ. నేడు ఆయన వర్ధంతి ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!