అందమైన ముఖం.. చక్కటి అభినయం… చిరునవ్వుకు చిరునామా .. కుటుంబ కథాచిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ .  వెండితెర పేరు మురళీ మోహన్. అసలు పేరు మాగంటి రాజబాబు. సినిమా, వ్యాపార, రాజకీయ రంగాలపై తనదైన ముద్రవేశారు మురళీమోహన్‌. క్రమశిక్షణ, పట్టుదలతో ఆయా రంగాల్లో జయభేరి మోగించారు.

ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించారు. మురళీమోహన్‌ 1963లోనే వ్యాపారరంగంలోకి అడుగుపెట్టారు. విజయవాడలో నాటకాలతో అనుబంధం ఏర్పడడంతో… అది సినిమా రంగ ప్రవేశానికి దారితీసింది. 1973లో ‘జగమే మాయ’ చిత్రంతో ప్రయాణం ఆరంభించిన ఆయన, 1974లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘తిరుపతి’తో నటుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకొన్నారు. ప్రత్యేకించి.. కుటుంబ కథాచిత్రాల్లో  కథానాయకుడిగా వందలాది చిత్రాల్లో నటించి విజయాల్ని సొంతం చేసుకొన్నారు. 1980లో సోదరుడు కిషోర్‌తో కలిసి, సొంత నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్స్‌ ప్రారంభించారు. తన వందో చిత్రమైన ‘వారాల అబ్బాయ్‌’ని నిర్మించారు. ఆ తరువాత పలు విజయవంతమైన చిత్రాలు ఆ సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. జయభేరి గ్రూప్‌ పేరుతో భవన నిర్మాణరంగంలోనూ అడుగుపెట్టి విజయాల్ని సొంతం చేసుకొన్నారు. మూవీ ఆర్టిస్ట్స్  అసోసియేషన్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు సేవలందించిన ఆయన, నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లలో వివిధ పదవులు చేపట్టి సేవలందించారు. నేడు మురళీమోహన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనికి శుభకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!